ఎంత మంచి పరిణామం. కలవని రైలు పట్టాల్లా, నింగి నేలలా, నీరు, నిప్పులా ఉండే మూడు పార్టీలవారు, అధికార పార్టీతో సహా అందరూ ఏకమాటపై నిలిచి, ఏక బాటలో వెళ్లడం అంటే..ఏమిటో ఈ మాయ అనిపిస్తుంది కదూ..! రాజకీయాలకంటే తమకు నగరాభివృద్దే ముఖ్యం అని, తమ నగర అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శం కావాలని ఈ నేతలు వ్యాఖ్యానించడం శుభ పరిణామమే కదా..! ఇక విషయంలోకి వస్తే… కరీంనగర్ ప్రజలను ఏళ్లతరబడి డంపింగ్ యార్డ్ సమస్య వేధిస్తోంది. కేంద్ర హూంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ దీనికి చెక్ పెట్టాలని భావించారు. కేంద్ర హౌసింగ్ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ నగర పర్యటనతో ఈ సమస్యకు పరిష్కారం చేయడంలో బండి సంజయ్ విజయవంతం అయ్యారు.
కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తామని, ఇందుకు ఎంత ఖర్చయినా కేంద్రమే భరిస్తుందని, బహిరంగ సభ వేదికగా కేంద్ర మంత్రి కట్టర్ హామీ ఇచ్చారు. దీంతో నగర ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బండి సంజయ్ కృషి వల్ల ఇది సాధ్యమైందని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు చర్చించుకున్నారు. ఇదేకాక రాష్ట్రానికి అధిక సంఖ్యలో ఇళ్లు కేటాయిస్తామని కేంద్ర మంత్రి కట్టర్ తెలిపారు. జెండా, ఎజెండా వేరైనా నగర అభివృద్ది విషయంలో తమది ఒకటే మాటని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేయడంతో…ఈ రీతిన అన్నిచోట్ల, అందరి నేతలు…ప్రజా సమస్యల విషయంలో ఏకతాటిపై వెళితే…వైరాలు, కోపతాపాలకు తావుండదని.. అందరికి మంచిదని మేధావులు, విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.