2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఉమ్మడి రాష్ట్రం విభజన నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జనాభా నిష్పత్తి 58.32 : 41.68గా ఉన్నది. ఉమ్మడి ఆస్తులను అదే నిష్పత్తిలో పంచుకోవాలని విభజన చట్టం తెలిపింది. అంతేకాదు 9,10 షెడ్యూళ్లలో ఉమ్మడి ఆస్తులను అలాగే సంస్థలను గుర్తించారు. ఆస్తుల విభజన కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి షీలా బిడేను నియమించారు. ఆమె నాయకత్వంలో ఆస్తుల పంపిణీపై కొన్ని మార్గదర్శక సూత్రాలు రూపొం దించి ప్రతిపాదనలు చేశారు. అయితే ఈ ప్రతిపాదనలు ఇప్పటివరకు అమలు కాలేదు. షీలా బిడే ప్రతిపాదనల మేరకుఉమ్మడి ఆస్తులలో ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ. లక్ష కోట్లు రావాలి. ఇంత వరకు ఈ ప్రతిపాదన అమలు కాలేదు. విభజన చట్టం ఇప్పటిదికాదు. ఈ చట్టం చేసి పదేళ్లు పూర్తి అయింది. దీంతో అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తుల పంపిణీ జరగుతుందా ? అనే ప్రశ్న తలెత్తింది.
విభజన చట్టంలో సెక్షన్ 46 ప్రకారం రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను కలిపి మొత్తం ఏడు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించారు. వీటికి బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజ్ ఇచ్చి అభివృద్ధి చేస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. మన్మోహన్ సింగ్ మాట ప్రకారం ఈ జిల్లాలకు దాదాపు 24 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. కానీ ఆచరణలో మూడేళ్లపాటు రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారు. 2015, 2016, 2017 సంవత్సరాలలో ఏడాదికి రూ.350 కోట్లు చొప్పున ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఊసేలేదు.
విభజన చట్టంలో సెక్షన్ 94(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణం కోసం కావలసిన సౌకర్యాలు సృష్టించటానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇవ్వాలి. దీనికి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం రూ.42,935 కోట్లు అంచనా వేసి నివేదిక కూడా ఇచ్చింది. కేంద్రం కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2015 అక్టోబర్ 22న అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి మాత్రమే అందించారు. అప్పటి చంద్రబాబు నాయుడు నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూములను సేకరించింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించగ లిగింది. అయితే ఆ తరువాత 2019 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరముందుకు తీసుకువచ్చింది. అంతేకాదు అమరావతి నామమాత్రం చేసింది. అమరావతిలో ఎటువంటి నిర్మాణాలకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ చొరవ చూపలేదు. అంతేకాదు రాజధాని నగరం నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీవ్ర అన్యాయం చేసింది.
ఇక పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీవ్ర అన్యాయం చేసింది. విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ప్రజా ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే చేపడుతుందని చట్టంలో తెలిపారు. పర్యావరణ, అటవీ, పునరావాస, పునర్నిర్మాణ అనుమతులకు కేంద్రానిదే బాధ్యత అని పేర్కొన్నారు. 2017-18 సవరించిన అంచనా మొత్తం రూ.55, 656 కోట్లుగా పేర్కొన్నారు. దీనిలో భూసేకరణకు, పునరావాసానికి రూ.33 వేల కోట్లు ప్రతిపాదిం చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడం అతి పెద్ద అంశం. ప్రాజెక్ట్ నిర్మాణం ఫలితంగా 373 గ్రామాలలో 1,05,000 కుటుంబాలు నిర్వాసితులుగా మారతాయి. అయితే ఇప్పటికీ కేవలం ఏడు వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం జరిగింది. అంతేకాదు పునరావాసానికి కేవలం ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. నిర్వాసితులు పునరావాసం జరగకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తికాదు అంటున్నారు నిపుణులు. గత ప్రభుత్వం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రెండూ నిర్వాసితుల పునరావాసాన్ని నిర్లక్ష్యం చేశాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ఫలితంగా నిర్వాసితులు పునరావాసానికి కేంద్రమే బాధ్యత వహించాలని విభజన చట్టం స్పష్టం చేస్తున్నది, కాగా పునరావాస నిధులతో తమకు ఏమాత్రం సంబంధం లేదని కేంద్రం చెప్పడం దారుణం.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోలవరం ప్రాజెక్ట్ జీవనాడి. కాగా ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో రెండు ప్రాంతీయ పార్టీలు అలాగే కేంద్ర ప్రభుత్వం తగినంత చొరవ చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పునరావాసం అంశానికి కూడా కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు నీటిపారుదలరంగ నిపుణులు. 2014లో విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ విద్యాసంస్థలు లేవు. విభజన చట్టం 13వ షెడ్యూల్‌లో జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ జాబితాలో ఎన్నో విద్యాసంస్థలున్నాయి. తిరుపతిలో ఐఐటీ, విశాఖపట్నం లో ఐఐఎమ్, అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ ప్రతిపాదించారు. అంతేకాదు విజయనగరంలో గిరిజన యూనివర్శిటీ, తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటీ, మంగళగిరిలో ఎయిమ్స్, గుంటూరు నగరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్శిటీ ప్రతిపా దించారు. అయితే వీటిలో కొన్నింటిని ప్రారంభించారు. మరికొన్నిటిని ఇంకా ప్రారంభించవలసి ఉంది. ఈ పదకొండు జాతీయ విద్యాసంస్థలకు ఇప్పటికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ కేవలం మూడు వేల కోట్లు ఖర్చుచేసి చేతులు దులుపుకుంది కేంద్ర ప్రభుత్వం. దీనితో ఈ జాతీయ విద్యా సంస్థలు వివిధ ప్రాంతాలలో అద్దె భవనాలలో నడుస్తున్నాయి. భవనాలు నిర్మించాలన్నా, నిర్మాణానికి స్థల సేకరణ జరగాలన్నా పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయి. సరిపడ నిధులు లేకపోవడంతో ఈ జాతీయ విద్యాసంస్థలలో మౌలిక వసతులు లోపించాయి. అంతిమంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడే విభజన చట్టంలోని అంశాలు సరిగా అమలు కాలేదు. గత పదేళ్లుగా పారిశ్రామికాభివృద్ధి లేక ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఏడాదికేడాది నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. 2024 జూన్ 2తో ఈ గడువు ముగిసింది. మొత్తంగా విభజన చట్ట హామీలు అమలు జరగక పోవటానికి నరేంద్రమోడీ ప్రభుత్వంతో పాటు గత పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు కూడా కారణమే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.