26.2 C
Hyderabad
Thursday, February 22, 2024
spot_img

అరుదైన దేశ నేత …దివంగత పీవీని వరించిన భారత రత్న

     చరిత్రగతిని మార్చే సత్తా కొంతమందికే ఉంటుంది. అలాంటి అతి కొద్ది మందిలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఒకరు. రాజకీయాల్లో పీవీది అరుదైన వ్యక్తిత్వం. వారసత్వ రాజకీయాలకు చిరునామా అయిన కాంగ్రెస్ పార్టీలో కేవలం తన స్వశక్తితో ఎదిగొచ్చిన నేత పీవీ నరసింహారావు. దేశం దివాళా అంచున ఉన్నప్పుడు పీవీ ప్రవేశపె ట్టిన ఆర్థిక సంస్కరణలే దిక్కయ్యాయి. సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన పట్టాలెక్కించారు. లైసెన్స్ రాజ్‌కు భరత వాక్యం పలికారు. ఇదిలా ఉంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రధాని పదవికి ఎన్నికైన తొలి నేతగా మరో చరిత్ర సృష్టించారు పీవీ నరసింహారావు.

      పీవీ నరసింహారావు అలనాటి నైజాం రాష్ట్రంలో 1921 జూన్ 28న జన్మించారు. తల్లిదండ్రులు రుక్నాబాయి, సీతా రామారావు.పీవీ సొంతూరు అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా లక్నేపల్లి గ్రామం. వరంగల్ జిల్లాలోనే ఆయన ప్రాథమిక విద్య సాగింది. అయితే ఆ తరువాత అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి చెందిన రంగారావు, రుక్మిణ మ్మ దంపతులు ఆయనను దత్తు తీసుకున్నారు. అప్పటి నుంచి పీవీ….వంగర బిడ్డ అయ్యారు. పీవీకి బాల్యం నుంచే జాతీయ భావాలు ఉండేవి. పదిహేడేళ్ల వయస్సులోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నైజాం పాలనపై సమరశంఖం పూరించారు. అప్పట్లో వందేమాతరం గీతాన్ని ఆలపించడంపై నైజాం సర్కార్ నిషేధాన్ని విధించింది. ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకుంటున్న పీవీ, ఈ నిషేధాన్ని పట్టించుకోలేదు. బహిరంగంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. దీంతో పీవీని ఉస్మానియా నుంచి బహిష్కరించారు.

      నైజాం పాలకులు బెదిరించినా పీవీ ఏమాత్రం బెదరలేదు. ఓ మిత్రుడి సాయంతో మహారాష్ట్ర వెళ్లారు. నాగపూర్ యూనివర్శిటీలో చేరారు. అక్కడే లా చదివారు. చదువుకునే రోజుల్లోనే స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృ ష్ణారావు తో పరిచయాలు పెరిగాయి. వారికి సహచరుడిగా అనేక ఉద్యమాల్లో పీవీ నరసింహారావు పాల్గొన్నారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ లో పీవీ చురుకైన పాత్ర పోషించారు. అప్పటి యువ కాంగ్రెస్ నాయకులతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పీవీ చురుకుదనాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించింది. దీంతో 1951 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఆయనకు సభ్యత్వం ఇచ్చింది.

      కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ బాధ్యతను అప్పగించినా పీవీ నరసింహారావు నూటికి నూరు శాతం న్యాయం చేసేవారు. ఒక సుశిక్షితుడైన కార్యకర్తగా ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆశీర్వాదంతో పార్టీలో అంచెలం చెలుగా ఆయన ఎదిగారు. 1971 సెప్టెంబర్ 30న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ బాధ్యతలు చేపట్టారు. పీవీకి ముఖ్యమంత్రి పదవి పూలపాన్పు కాలేదు. సీఎం పోస్టు ఆయనకు ముళ్ల బాటే అయింది. ముఖ్యమంత్రిగా అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు పీవీ. సమాజంలో నెలకొన్న అసమానతలకు భూ సంస్కరణలే పరిష్కారమని ఆయన నమ్మారు. తన నమ్మకానికి తగ్గట్టు భూ సంస్కరణలు తీసుకువచ్చారు. దీంతో ఒక వ్యక్తి పేరు మీద వందల ఎకరాలు భూములుండే విధానానికి చెక్ పడినట్లయింది. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కూడా పీవీ హయాంలోనే వచ్చింది.

       వాస్తవానికి భూ సంస్కరణలు గొప్ప విప్లవాత్మక నిర్ణయం. ఇటు పీవీ సర్కార్ భూ సంస్కరణలను తీసుకువచ్చారో లేదో అటు జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. భూ సంస్కరణలకు వ్యతిరేకంగా సీమాంధ్ర భూస్వామ్య కుటుంబాల నుంచి వచ్చిన రాజకీయనేతలు మొదలుపెట్టిన ఉద్యమమే జై ఆంధ్ర అంటారు పొలిటికల్ ఎనలిస్టులు. జై ఆంధ్ర ఉద్యమం…ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను ఊపేసింది. పీవీ పాలన నడిచే పరిస్థితులు లేకుండా పోయాయి. దీంతో పీవీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని 1973లో కేంద్రం రద్దు చేసింది. దీంతో పీవీ ముఖ్యమంత్రి పదవి రెండేళ్లకే ముగిసింది. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక పీవీ నరసింహారావు మకాం హస్తినకు మారింది. ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో బిజీ అయిపోయారు.1991 నాటికి పీవీ నరసింహారావు దాదాపుగా క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేయలేదు. హైదరాబాద్ వచ్చి తీరికగా పుస్తకాలు రాసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆగమాగం అయింది. పార్టీకి దశ దిశ చూపించే ఒక నాయకుడంటూ ఎవరూ లేకుండా పోయారు. లోక్‌ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రధాని పదవి చేపట్టడానికి సోనియా గాంధీఅంగీకరించలేదు. దీంతో ప్రధాని గా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కాంగ్రెస్ అగ్ర నాయకులు తర్జనభర్జనలు పడ్డారు. చివరకు సౌమ్యుడైన పీవీ నరసింహారావుకు నాయకులందరూ ఓటేశారు. అలా అనూహ్య పరిస్థితుల్లో దేశ ప్రధాని పగ్గాలు చేపట్టారు పీవీ నరసింహారావు. దక్షిణాది నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి రాజకీయవేత్తగా పీవీ నరసింహారావు చరిత్రలో తన పేరు నమోదు చేసుకున్నారు.

        పీవీ….ప్రధాని అయ్యేనాటికి దేశం పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆర్థికంగా దివాళా తీసింది. లైసెన్స్ రాజ్ నడుస్తోంది. ఏ చిన్న పరిశ్రమ పెట్టాలన్నా బోలెడన్ని అవరోధాలు…అడ్డంకులు. ప్రతి చిన్న దానికీ లైసెన్స్ అవసరమనే విధానాలు నడిచేవి. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని రక్షించడానికి పీవీ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. తెలుగు బిడ్డ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని రక్షించాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ మెరుగుపడింది. చాలా తక్కువ వ్యవధిలోనే ఆర్థిక సంస్కరణలు మంచి ఫలితాలు ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో భారతదేశానికి మరోసారి క్రేజ్ పెరిగింది. దేశంలోకి అనేక పరిశ్రమలు వచ్చాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాయి.

         పీవీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. ఇవాళ మనం చూస్తున్న ఈ అద్భుతమైన అభివృద్ధి అంతా పీవీ హయంలో అమలైన ఆర్థిక సంస్కరణలు పుణ్యమే అంటే అతిశయోక్తి కాదు. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడని …రాజకీయ విశ్లేషకులు అంటారు. పీవీ గొప్ప సహన శీలి. తన నిజాయితీని, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఆయన మౌనంగానే భరించారు. ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు ప్రత్యారోపణల జోలికి వెళ్లలేదు. మౌలికంగా ఆయన మ్రుదు స్వభావి. ఎవరినీ నొప్పించడం ఆయన కు చాత కాదు. అంతేకాదు…మితభాషి కూడా. అవసరమైతేనే ఎదుటి వాళ్లతో మాట్లాడేవాళ్లు. లేదంటే తన పని తాను చేసుకుంటూ సైలెంట్ గా ఉంటారు. పీవీ నరసింహారావు వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. రాజకీయాల్లో ఆయనలాంటి సాహితీవేత్త ఎక్కడా కనిపించరు. 17 భాషల్లో తడుముకోకుండా మాట్లాడగల సత్తా ఆయన సొంతం. మాట్లాడటమే కాదు అనేక పేరొందిన పుస్తకాలను ఆయన అనువదించారు. ఇన్ సైడర్ పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. ప్రధాని వంటి అత్యున్నత పదవి చేపట్టినా ఆయన నిరాడంబరంగానే జీవించారు. ఒక్క మాటలో చెప్పాలంటే …పీవీ తెలుగువాడు కావడం మన అదృష్టం.

Latest Articles

ఆందోళనకు బ్రేక్‌ ఇచ్చిన అన్నదాతలు

     పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీతో పాటు పలు డిమాండ్లతో దేశ రాజధాని దిశగా కదం తొక్కిన రైతులు.. రెండు రోజులపాటు ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను వాయిదా వేసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్