టార్గెట్ బీఆర్ఎస్… తెలంగాణ సర్కారు నినాదం ఇప్పుడు ఇదేనా… అంటే అవునన్న సమాధానమే విన్పిస్తోంది. కొద్ది రోజుల క్రితం థర్మల్ పవర్ ప్లాంట్లపై విచారణ, అనంతరం మేడిగడ్డ వ్యవహారం.. ఇప్పుడు మిషన్ భగీరథ.. ఇలా ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి చూస్తే ఇవే ఆలోచనలు రాక మానవన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో విన్పిస్తోంది. మరి.. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ సర్కారును టార్గెట్ చేసిందా ? అసలు ఎందుకీ పరిస్థితి తలెత్తింది ? ఇలాంటి రాజకీయాలు రానున్న రోజుల్లో ఎటు టర్న్ తీసుకుంటాయి ?
బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఏ ఒక్క అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకోవడం లేదా అంటే అవునన్న సమాధానమే విన్పిస్తోంది. ఇందుకు నిదర్శనమే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. మిషన్ భగీరథ పథకం పనులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల వేళ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటిని అందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చింది. దాదాపు 40 వేల కోట్ల రూపాయల మేర ఖర్చు చేసి మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయగా.. ఆ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని రేవంత్ సర్కారు భావిస్తోంది. సుమారు ఆరు నుంచి ఏడు వేల కోట్ల విలువైన పనుల్లో అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తోంది. పనులు చేయకుండానే బిల్లులు తీసుకోవడం, జరిగిన పనులనే కొత్తగా చేసినట్లు పేర్కొనడం, ఆయా పనులకు అవసరమైన సామాగ్రిని కొనకుండానే లెక్కల్లో చూపడం, కొన్న వాటిని ఉపయోగించకుండా నిరుపయోగంగా పక్కన పడేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి పలు అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ విచారణ జరిపించాలని నిర్ణయానికి వచ్చింది రేవంత్ ప్రభుత్వం.
వచ్చిన ఫిర్యాదుల సంగతి కాస్త పక్కన పెడితే… ఆయా ఆరోపణలు ఎంతవరకు నిజం, ఏ స్థాయిలో అవకతవ కలు జరిగాయన్నది తెలుసుకునే విషయంలో ఓ అవగాహనకు వచ్చేందుకు మండలానికి ఒక గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో.. సీఎం ఆదేశాల మేరకు విజిలెన్స్ బృందాలు త్వరలోనే రంగంలోకి దిగి ఆయా గ్రామాల్లో పర్యటించి జరిగిన వాస్తవాలు, చోటు చేసుకున్న అవకతవకలు ఏంటన్నవి ప్రత్యక్షంగా తెలుసుకోనున్నాయి. కేవలం మిషన్ భగీరథే కాదు.. ఇటీవలె మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలోనూ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బ్యారేజీ కుంగిపోవడంతో నాడు ప్రతిపక్ష నేతల హోదాలో కాంగ్రెస్ నాయకులు నాటి బీఆర్ఎస్ సర్కారుపై ఫైరయ్యారు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను వెలికితీస్తామని అప్పట్లోనే ప్రకటించారు. అన్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో వెంటనే రేవంత్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం,వారు మధ్యంతర నివేదిక ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.
ఇటీవలె ప్రభుత్వానికి చేరిన విజిలెన్స్ నివేదికలో కీలక అంశాలు చాలానే ఉన్నాయి. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, దెబ్బతిన్న పనులు చేపట్టే విషయంలో ఇటు కాంట్రాక్టర్ సంస్థ, అటు నీటిపారుదల శాఖ ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపించింది. నిర్మాణ సంస్థ 2020 అక్టోబర్‌లో చేసిన విజ్ఞప్తి మేరకు 2021 మార్చిలో పని పూర్తి చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ, ఇంజినీర్ ఇన్ చీఫ్ మాత్రం నిర్మాణ సమయాన్ని పొడిగించారు. ఒకసారి పనిపూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి మళ్లీ పొడిగించడం సరికాదు. ఇంతటితో ఆగలేదు.. సరికదా రెండు బిల్లులు కలిపి 280 కోట్ల మేర చెల్లించారు. ఇలా ఒకటీ రెండూ కాదు అనేక అవకతవకల కారణంగా ఒప్పందం విలువ నాలుగేళ్లలో 133 శాతం పెరిగిందన్న విషయాన్ని తమ నివేదికలో విజిలెన్స్ వెల్లడించిందని తెలుస్తోంది. అంతేకాదు.. మరిన్ని కీలక విషయాలను సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. ముఖ్యమైన కొన్ని సిఫార్సులను సైతం ప్రభుత్వానికి చేసింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్.
ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన యాదాద్రి సహా ఇతర థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలు, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం సహా అన్ని అంశాలపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తామంటూ అసెంబ్లీ వేదికగా కొన్ని రోజుల కిందటే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ముఖ్యమైన పథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది రేవంత్ సర్కారు. అయితే.. ఇదంతా కేవలం కక్ష సాధింపుల చర్య తప్పితే మరోటి కాదంటోంది ప్రధాన ప్రతిపక్షం. అదే సమయంలో ప్రభుత్వం ఎలాంటి ఎంక్వైరీలు వేసినా ఇబ్బంది లేదంటున్నారు గులాబీ పార్టీ నేతలు. రాజకీయ నేతల మాటల సంగతి కాస్త పక్కన పెడితే.. తెలంగాణలో మాత్రం రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్న అభిప్రాయం బలంగా విన్పిస్తోంది.