ఏపీలో ఎన్నికల జాతర మహా రంజుగా సాగుతోంది. అధికార పార్టీ వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్ష కూటమి ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. రేసు గుర్రాల ఎంపికలో ఆచితూచి వ్యవహరి స్తోంది విపక్ష కూటమి. జగన్‌ను ఢీకొట్టి అధికార పీఠం చేజిక్కించుకోవడమే కాకుండా.. ఎన్నికల రణరంగంలో వైసీపీ నేతలను మట్టికరిపించి తామ సత్తా ఏంటో చూపించేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ తన గెలుపు గుర్రాల జాబితాను తుది జాబితాను విడుదల చేసింది.
అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికల చివరి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది తెలుగు దేశం పార్టీ. ఇప్పటి వరకూ మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. పెండింగ్‌లో పెట్టిన 9 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తంగా ఇప్పటి వరకు టీడీపీ 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకూ ఉన్న సీనియర్లు, నియోజకవర్గాల మార్పులు, చేర్పులు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను అభ్యర్థులుగా ప్రకటించింది టీడీపీ హైకమాండ్.
ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఎట్టకేలకు భీమిలి సీటు దక్కించుకుని తన పంతం నెగ్గించుకున్నారు. మొదటి నుంచి గంటాను చీపురుపల్లి బరిలో దించాలన్న యోచనలో ఉంది టీడీపీ అధిష్టానం. అయితే,.. అందుకు సిద్ధంగా లేని గంటా.. తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని పట్టుపట్టుకు కూర్చున్నాడు. దీంతో చంద్రబాబు, గంటా మధ్ సుమారు రెండు వారాల పాటు పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. అయితే,.. చివరికి భీమిలి స్థానాన్నే కేటాయించి ఆయన కోరుకున్న చోటే బరిలో దించింది పార్టీ అధిష్టానం. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ఎచ్చెర్ల సీటు ఆశించిన కళాను మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి దించింది. అలాగే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అవకాశం ఇచ్చింది. అలాగే ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గమైన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ పెద్ద తతంగమే జరిగింది. చివరికి సుగవాసి సుబ్రమణ్యంను ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలిపింది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు సీటు కేటాయించారు.
విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడును టీడీపీ బరిలో నిలిపింది. అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఊహించని అభ్యర్థికి టీడీపీ టికెట్ దక్కింది. ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టికెట్ ఆశించారు. తొలుత ఈ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. చివరకు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు సీటు దక్కింది. దీంతో అనంతపురం అర్బన్ టీడీపీలో అసంతృప్తి సెగలు ఎగసిపడ్డాయి. దగ్గుబాటి ప్రసాద్‌కు టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ చౌదరి తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఈ పరిణామాలతో ప్రభాకర్ వర్గీయులు హైకమాండ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలను తగులబెట్టారు. పార్టీ జిల్లా కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కుర్చీలు, బల్లలకు నిప్పుపెట్టారు. పలుచోట్ల కూడా ఆశావహులు అసంతృప్తితో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
ఎనిమిది అసెంబ్లీ స్థానాలు, నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. వీటితో పాటు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చింది. కదిరి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కంది కుంట వెంకట ప్రసాద్ సతీమణి కందికుంట యశోదాదేవికి గతంలో టికెట్ కేటాయించారు. అయితే మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌పై ఉన్న నకిలీ డీడీల కేసును నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేయటంతో ఇప్పుడు తిరిగి కందికుంటకే టికెట్ ఇచ్చింది. ఇక ఈసారి కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజుకు నిరాశే ఎదు రైంది. ఇటీవలే విడుదల చేసిన బీజేపీ లిస్టులో పేరు లేకపోవడంతో.. టీడీపీ రిలీజ్ చేసే చివరి జాబితాపై ఆశ పెట్టుకున్నారు రఘురామ. కానీ ఈ జాబితాలోనూ ఆయనకు చోటు దక్కలేదు. ఇకపోతే అటు టీడీపీ, ఇటు వైసీపీ హేమాహేమీలంతా ఎన్నికల రణరంగంలో తలబడు తున్నారు. వైసీపీ ముఖ్య నేతలను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థులనే బరిలో దించింది తెలుగు దేశం పార్టీ. ఈ నేపథ్యంలోనే భీమిలిలో అవంతి శ్రీనివాస్‌కు ఓటమి రుచి చూపించేందుకు గంటా శ్రీనివాస్ పోటీకి సై అంటుంటే.. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణను మట్టి కరిపించేందుకు కళా వెంకట్రావ్ బరిలో దిగనున్నారు. అలాగే గుంతకల్లు ఇలాఖాలో వై వెంకట్రామిరెడ్డిపై గుమ్మనూరు జయరాం కాలుదువ్వుతుంటే.. కదిరి నియోజకవర్గంలో మక్బూల్ అహ్మద్‌ను కందికుంట ప్రసాద్ ఢీకొట్టనున్నారు.


