ఝార్కండ్ రాజకీయ దిగ్గజం హేమంత్ సోరేన్ ఎపిసోడ్‌తో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ మరోసారి తెరమీదకు వచ్చింది. హేమంత్ సోరేన్‌పై ఇటీవల భూకుంభకోణం ఆరోపణలు ఇచ్చాయి.ఇందుకు సంబంధించి సోరేన్‌పై మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. రాతి గనుల మైనింగ్ లీజును తనకు అనుకూలమైన వారికి కట్టబెట్టారన్నది హేమంత్ సోరేన్‌పై వచ్చిన ప్రధాన ఆరోపణ. అలాగే ఈ లీజులను అధిక ధరలకు కేటాయించా రన్నది మరో ఆరోపణ. మైనింగ్ లీజుతో పాటు విదేశాల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా నగదు దేశంలోకి వచ్చినందన్న ఆరోపణ కూడా వచ్చింది. ఇలా వచ్చిన నగదుకు హేమంత్ సోరేన్ లెక్కలు చూపించలేకపోయారు. చివరకు ఇదంగా లెక్కాపత్రంలేని డబ్బు అని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో హేమంత్ సోరేన్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు.
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను రాంచీలోని అధికార నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారు లు జనవరి 20న సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ సందర్భంగా సోరేన్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. మనీ లాండరింగ్ కేసు కు సంబంధించి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 14 మందిని ఎన్ఫోర్స్మెంట్ డైరక్ట రేట్ అధికారులు అరెస్ట్ చేశారు. 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూ టీ కమిషనర్‌గా పనిచేసిన రంజన్‌ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఈడీ దర్యాప్తులో భాగంగా, సోరేన్ కార్యాలయం, నివాసాల్లో ఈడీ అధికారులు ఇటీవల సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా జనవరి 29వ తేదీన ఢిల్లీలోని హేమంత్ సోరేన్ అధికారిక నివాసం దగ్గరకు ఈడీ అధికారులు చేరుకున్నారు. సాయంత్రం వరకు ఎదురుచూసినా, ఈడీ అధికా రులకు హేమంత్ సోరేన్ అందుబాటులోకి రాలేదు. దీంతో అక్రమంగా సంపాదించిన డబ్బులతో కొన్నారని భావిస్తున్న రెండు బీఎండబ్ల్యూ కార్లను, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను అలాగే రూ. 36 లక్షల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ సోదాల సందర్భంగా సోరేన్ నివాస ప్రాంతం దగ్గర 144వ సెక్షన్ విధించారు.
హేమంత్ సోరెన్ పై కేసులు కొత్తకాదు. సోరేన్, కొన్నేళ్ల కిందట రాంచీలోని అంగారా బ్లాక్‌లో మైనింగ్ లీజ్ దక్కించు కున్నారు. ఇందుకు అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతుల కోసం ఆయన 2021 సెప్టెంబర్ 9న దరఖాస్తు చేసుకున్నారు. ‘స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ’ సరిగ్గా తొమ్మిది రోజుల్లో.. అంటే.. సెప్టెంబర్ 18న హేమంత్ సొరేన్‌కు అనుమతులు మంజూరు చేసింది. మైనింగ్, పర్యావరణ శాఖలు రెండూ ముఖ్యమంత్రిగా తన పరిధిలోనే ఉండడంతో, మైనింగ్ లీజుల కోసం ఆయా శాఖల ఉన్నతాధికారులపై సోరేన్ ఒత్తిడి చేశారన్నది అప్ప ట్లో వచ్చిన ప్రధాన ఆరోపణ. హేమంత్ సోరేన్‌పై ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసు, ఝార్కండ్‌లో ప్రకంప నలు సృష్టిస్తోంది. ఝార్కండ్ రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుం దో అన్నట్లు ఝార్కండ్ రాజకీయాలు మారిపోయాయి. ఒక దశలో హేమంత్ సోరేన్ మిస్సింగ్ అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఒక ప్రకటన చేసింది. మనదేశంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మిస్సింగ్ అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ప్రకటన చేయడం ఇదే తొలిసారి.


