రేవంత్ సర్కార్‌పై నెలన్నర రోజులు గడవకముందే బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించిందా..? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని..కొత్త నిర్ణయాలు ఏమీ లేవని..అప్పుడే కౌంటర్ ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తోందా..? ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నా.. గులాబీ నేతలు ఎందుకు ఆగడం లేదు..? ఇందుకు వేరే వ్యూహం ఏదైనా ఉందా..?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలన్నర రోజులు దాటిపోయింది. కొత్త ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధా న్యత ఇస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆరు ఉచిత గ్యారంటీల అమలు.. వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంపై దృష్టి సారించారు. వీటితో పాటు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లారు. ఈసారి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని..రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్తగా సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవని విమర్శిస్తోంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 45 రోజులు కూడా పూర్తి కాలేదు. అప్పుడే మార్పును ఆశించడం అత్యాశే అవుతుందని రాజకీయ విశ్లేషకలు అభిప్రాయపడు తున్నారు. పదేళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం సమయం ఇవ్వకుండా విమర్శలకు దిగడం సమంజసం కాదంటున్నారు.
వాస్తవానికి కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమల్లోకి తెస్తామని ప్రకటించింది. ఉచిత బస్సు పథకాన్ని రెండు, మూడు రోజుల్లోనే అమల్లోకి తెచ్చేసింది. మిగతా పథకాల కోసం దరఖాస్తులు తీసుకుం ది. ప్రస్తుతం అవి పరిశీలన దశలో ఉన్నాయి. ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ..బీఆర్ఎస్ మాత్రం రోజు రోజుకు విమర్శల వేడి పెంచుతూనే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి.
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతిభవన్‌లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తామన్నారని.. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అయితే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వెంటనే ప్రగతిభవన్‌ను ప్రజా దర్బార్‌గా మార్చింది. ప్రజాదర్బార్‌కు ఎవరో ఒక మంత్రి హాజరవుతున్నారు కూడా. మిగతా రోజులు అధికారులు దరఖా స్తులు స్వీకరిస్తున్నారు. ఇక ఎన్నికల ముందు పారిశ్రామికవేత్త అదానిపై రేవంత్ విమర్శలు చేసేవారని.. కానీ ఇప్పుడు సీఎం హోదాలో ఏకంగా ఆదానితోనే పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే దీనికి కౌంటర్‌గా రాష్ట్రంలో 12వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదాని ముందుకొస్తే.. ఆయనతో రేవంత్ ఒప్పందా లు చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అదాని దోపిడికి మాత్రమే తాము వ్యతిరేకమని..వారి పెట్టుబడులను స్వాగతిస్తే తప్పేంటని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే దీన్ని బీఆర్ఎస్ ఎక్కడా స్వీకరించే పరిస్థితి కనిపిం చడం లేదు.
ఇక ప్రభుత్వ సలహాదారుల నియామకాలపై కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పాత సలహాదారులను రేవంత్ ప్రభుత్వం తొలగించింది. తాజాగా ముగ్గురు సలహాదారుల నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, tpcc ఉపాధ్యక్షు డు హర్కర వేణుగోపాల్ ను ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. వీరందరికీ సహాయ మంత్రి హోదాను కల్పిం చింది. అయితే ఈ నియామకాలపై బీఆర్ఎస్ విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇలా మొత్తానికి అధికారంలోకి వచ్చి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమైంది బీఆర్ఎస్. అయితే ఇదంతా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వీలైనం త తక్కువ స్థానాలకు పరిమితం చేయడం కోసమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్కు లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మెరుగైన ఫలితాల్ని సాధించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే సమయం కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ యుద్ధం ప్రారంభించిందన్న వాదన వినిపిస్తోంది.


