YSRCP నేత నాగార్జున యాదవ్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరు పారిపోతున్న నాగార్జునను ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కుప్పం పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కుప్పం స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు విచారణలో భాగంగా నాగార్జునను ప్రశ్నిస్తున్నారు. పరుష పదజాలంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనా నాగార్జున మాట్లాడారు. నాగార్జున యాదవ్ వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు పోలీసుస్టేషన్‌ల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా నాగార్జున యాదవ్ కనిపించకుండా తిరుగుతున్నారు. ఆదివారం రాత్రి రహస్యంగా గుంటూరు నుంచి బెంగళూరు బస్సులో వెళ్తున్న ఆయన్ను కుప్పం పోలీసులు అదుపులో తీసుకున్నారు. కుప్పం స్టేషన్ పరిధిలోనూ నాగార్జునపై ప్రజాప్రతినిధులను దూషించిన కేసు నమోదైంది. చిత్తూరుకు చెందిన వరుణ్‌కుమార్ అనే తెలుగుదేశం కార్యకర్త ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్యంగా దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుణ్‌కుమార్ ఫిర్యాదు ఆధారంగా నాగార్జునపై కుప్పం పోలీసు స్టేషన్‌లో FIR నమోదు చేశారు. పోలీసులు రాతంత్రా నాగార్జును విచారించారు. ప్రస్తుతం ఆయన వారి అదుపులోనే ఉన్నారు.