దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుమార్తె, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. భర్త, కొడుకు, కోడలు, కుమార్తెతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న షర్మిల.. వైఎస్ఆర్ ఘాట్ పై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులవెంట వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు.
వైయస్సార్ ఒక డైనమిక్ లీడర్ అని అన్నారు షర్మిల. ప్రజా లీడర్ అంటే ఎలా ఉండాలో నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలిచిన నాయకుడు వైయస్సార్ అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా గొప్ప పరిపాలన అందించారన్నారు. వైఎస్ఆర్ మృతిని జీర్ణించుకోలేక 700 మంది చనిపోయారంటే ఆయన ఎంత గొప్ప ప్రజానాయకుడో చెప్పాల్సిన అవసరం లేదని షర్మిల అన్నారు.
ఇదిలాఉంటే.. వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం విజయవాడలో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగే ఈ జయంతి వేడుకలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతలు, తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు పాల్గోనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు విజయవాడలో జరిగే వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గోననున్నారు.


