YS Sharmila | యువతను నిరుద్యోగం పట్టిపీడిస్తున్నా కేసీఆర్ గారికి సోయి లేదని మండిపడ్డారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.వైస్.షర్మిల. ప్రశ్నిస్తే, అధికారం అడ్డంపెట్టుకొని సీఎం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఏకమై పోరాడితే తప్ప నిరుద్యోగులకు న్యాయం జరగదని తెలిపారు. ఇందుకోసం T-SAVE పోరుతో సీఎం కేసీఆర్ ను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీ లన్నీ ఏకమై సీఎం కేసీఆర్ ను మెడలు వంచుదామని తెలిపారు. ఇందులో భాగంగా T-SAVE పోరుతో ముందుకుపోవాలని, దీనికి నాయకత్వం వహించాలని TJS అధ్యక్షులు ప్రొ.కోదండరాంని షర్మిల కోరారు.
ఈ సందర్బంగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నపత్రాల లీకేజీని వ్యాపారంగా మలిచిందని అన్నారు. వైఎస్ఆర్టీపీ చేపట్టిన T-SAVE లో భాగం కావాలని ఆ పార్టీ చీఫ్ షర్మిల కోరిందని తెలిపారు. అయితేఎవరితో భాగం కావాలనేది పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ ను ఎలాగైనా గద్దెదించాలని కంకణం కట్టుకున్న షర్మిల(YS Sharmila) అదేపనిగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని నిర్వచించారు. బంగారు తెలంగాణ పేరిట రాష్ట్ర ఖజానాను దోచుకొని.. పార్టీ ఫండ్స్ అకౌంట్ లోనే రూ.1000 కోట్లకు పెంచుకొని.. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు కొనుకొంటున్న కేసీఆర్ గారు.. రేపు దేశ ప్రధాని పదవిని కొనేందుకు తయారయ్యారని ట్విట్టర్ లో మండిపడ్డారు. ఇక దొరగారు రాబోవు ఎన్నికల్లో రూ.20వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్తున్నారట. ఒకప్పుడు స్కూటర్ లో తిరిగే మీకు… ఫైనాన్స్ కట్టడానికి డబ్బులు లేని మీకు .. ఈ సొమ్మంతా ఎక్కడిది? కాళేశ్వరం కమీషన్లు.. కొడుకు రియల్ ఎస్టేట్ మాయలు.. బిడ్డ లిక్కర్ దందాలా ధనమేనా సారు?’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘అధికారం చేతిలో ఉందని అవినీతికి పాల్పడి.. రాష్ట్రాన్ని దోచుకున్నారు. దాచుకున్నారు. ఇప్పుడు దాచుకున్న సొమ్ముతో దేశ ప్రధాని పదవిని కొనేందుకు చూస్తున్నావా దొర? దీనినే రాజకీయ వ్యాపారం అంటారు కాబోలు.’ సెటైరికల్ కామెంట్స్ చేశారు షర్మిల.
Read Also: పేపర్ లీకేజీల వెనుక సూత్రధారులెవరు? పాత్రధారులెవరు?