MLC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోలహాలం నడుస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పలు స్థానాలు ఏకగ్రీవం కాగా.. ముఖ్యంగా ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు సంబంధించి ఈనెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రా పట్టభద్రుల నియోజకవర్గంలో 37 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. వీరిలో వైసీపీ, టీడీపీ, బీజేపీతో పాటు.. ప్రజాసంఘాలు బలపర్చిన పిడిఎప్ అభ్యర్థి, పలువురు స్వతంత్రులు సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పోటీ నలుగురు అభ్యర్థుల మధ్య ఉంటుందని అందరూ భావించినా బలమైన స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎవరికి గెలుపు అంతా ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రధాన రాజకీయపక్షాలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. గడువు సమీపిస్తుండంతో అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆరు జిల్లాల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. స్థానికంగా ఉండే పార్టీ క్యాడర్‌తో కలిసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఉత్తరాంధ్రలో నెలకొన్న నిరుద్యోగం, వెనుకబాటుతనం, ఉక్కు ప్రైవేటీకరణ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, సీపీఎస్ రద్దు వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. గత నాలుగేళ్లలో సాధించిన ప్రగతిని అధికార వైకాపా నేతలు వల్లెవేస్తున్నారు. ఈనెల 11వ తేదీ సాయంత్రం 4గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది.
MLC Elections: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 37 మంది పోటీలో ఉండగా.. ఆయా అభ్యర్థుల ఫొటోలతో బ్యాలెట్ పత్రం రెడీ అయింది. మొదట బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ ఉండగా, రెండు, మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు, వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఉన్నారు. పీడీఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ పేరు 11వ స్థానంలో ఉంది. స్వతంత్ర అభ్యర్థులు వరసగా.. అధికార్ల వెంకట రామకృష్ణ, అప్పలరాజు ఇల్లిపల్లి, అప్పారావు కేవీ, అహమ్మద్ షేక్, ఆడారి శరత్‌చంద్ర, ఆనందరావు దండిల, కోడి శ్రీనివాసరావు, గంటా చిరంజీవి, గంటి రవికుమార్, గణపతి జగదీశ్వరరావు, గుంటు దుర్గాప్రసాద్, గుండపల్లి సతీష్, గిద్దలూరు విజయకుమార్, చిప్పాడ శేషగిరిరావు, చెవేటి జీవన్‌కుమార్, దుప్పల రవీంద్రబాబు, నక్కెళ్ల నర్సింగరావు, నమ్మి అప్పలరాజు, నాయుడుగారి రాజశేఖర్, బి.వి.నారాయణరెడ్డి, నూకల సూర్యప్రకాష్, పవని శాంద్ర, పురిపండా శ్రీనివాసరావు, పూడి కిరణ్‌కుమార్, పొట్నూరు కిరణ్‌కుమార్, బండారు ఎస్.వి.జె.ప్రతాప్‌కుమార్, బలివాడ రామసంతోష్, ఎ.రమాప్రభ, రాజాన మోహనరావు, రొంగలి గంగా భవాని, లోకనందం కాళ్ల, సుభాష్‌చంద్ర, హేమంత్‌కుమార్ ఉన్నారు.
MLC Elections: ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థుల్లో గిద్దలూరు విజయ్‌కుమార్ ప్రధాన అభ్యర్థులకు పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ, టీడీపీలకు చెందిన నాయకులతో గతంలో ఉన్న పరిచయాలతో పాటు.. సుదీర్ఘకాలం విద్యార్థిసంఘంలో పనిచేయడంతో యువకుల్లో విజయ్‌కుమార్‌కు ఉన్న పరిచయాలతో ఆయన కూడా ప్రధాన పోటీదారుడుగా ఉన్నాడనే ప్రచారం వినిపిస్తోంది. ఉత్తరాంధ్రా జిల్లాల్లో పర్యటిస్తూ పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేస్తానంటూ హామీ ఇస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ నేత మాధవ్ ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీ తరపున పోటీచేస్తున్నారు. గతంలో గిద్దలూరు విజయ్‌కుమార్ మాధవ్ గెలుపు కోసం పనిచేశారు. అయితే రాజకీయ పార్టీలకు అతీతంగా పట్టభద్రులంతా వారి కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఆయన పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వగా ప్రస్తుతం టీడీపీ తన అభ్యర్థిగా ఉపాధ్యాయ, విద్యార్థి వర్గంలో పట్టు ఉన్న డాక్టర్ వేపాడ చిరంజీవిరావును బరిలోకి దించింది. పార్టీ సీనియర్ నేతలంతా చిరంజీవికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అధికార వైసీపీ నుంచి సీతంరాజు సుధాకర్ పోటీచేస్తున్నారు. తన సామాజిక వర్గం ఓట్లు తన గెలుపునకు సహకరిస్తాయనే విశ్వాసంలో ఆయన ఉన్నారు. 200 ప్రజాసంఘాల మద్దతు తనకు కలిసి వస్తోందని పిడిఎఫ్ అభ్యర్థి రమాప్రభా ధీమా వ్యక్తం చేస్తుండగా.. జనసేన మాత్రం వైసీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేయాలన పిలుపునిచ్చింది. దీంతో జనసైనికులు ఎవరికి మద్దతు తెలుపుతారు.. పొత్తులో ఉన్న బీజేపీ అభ్యర్థి మాధవ్‌కా, టీడీపీ అభ్యర్థి చిరంజీవికా, లేదా స్వతంత్ర అభ్యర్థులకా అనేది చర్చానీయాంశంగా మారింది.
మరోవైపు ఓట్ల చీలికతో పాటు.. తనకున్న పరిచయాలు తనకు గెలుపునందిస్తాయని, మేధావులు, విద్యావంతులు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు తనకు మద్దతు పలుకుతున్నారంటూ గిద్దలూరు విజయ్‌కుమార్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు సైతం తాము గౌరవప్రధమైన స్థాయిలో ఓట్లు సాధిస్తామని, ప్రధాన అభ్యర్థులకు పోటీ ఇస్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నా.. స్వతంత్ర అభ్యర్థుల పోటీతో మాత్రం అభ్యర్థుల గుండెల్లో గుబులు మొదలైందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రలోభాల పర్వం..
ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ప్రలోభాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది ఓటర్లు మాత్రం ప్రలోభాలకు తాము లొంగేది లేదని, తాము సరైన ప్రతినిధిని మండలికి పంపిస్తామని బాహటంగా చెప్తున్నారు. అయితే ఈసారి 2 లక్షల 87 వేల మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. వీరిలో పురుష ఓటర్లు లక్షా 80 వేలు కాగా మహిళా ఓటర్లు లక్షా 6వేల ఉన్నాయి. 38 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. విశాఖ జిల్లాలో లక్షా 5వేల మంది, విజయనగరంలో 58వేల382మంది శ్రీకాకుళం జిల్లాలో 52వేల 196 మంది, అనకాపల్లి జిల్లాలో 41వేల514 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11వేల571 మంది, పార్వతీపురం మన్యంలో 18వేల 360 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా తమ ప్రతినిధిగా ఎవరిని మండలికి పంపిస్తారు.. ప్రధాన అభ్యర్థులకు పట్టభద్రులు షాకిస్తారా అనేది ఆసక్తిగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..