వైసీపీ సర్పంచులు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా పంచాయతీ నిధుల్లో డబ్బులు లేవని మండిపడ్డారు. జగన్‌ను సీఎంగా గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం నేతలు సమావేశమై ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అసలే సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థతో తాము ఇబ్బందులు పడుతుంటే.. కొత్తగా కన్వీనర్లు, గృహసారథులను పెట్టి సర్పంచుల వ్యవస్థనే ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చినాంపల్లె గ్రామ వైసీపీ సర్పంచ్ పగడాల రమేశ్ చెప్పుతో కొట్టుకున్నారు. వైసీపీ తరపున సర్పంచుగా గెలిచినందుకు సిగ్గు పడుతున్నామని ఆయన తెలిపారు.