ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్టయ్యారు. గన్నవరం దగ్గర్లో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి ఘటనలో నిందితుడిగా ఉన్నారు వల్లభనేని వంశీ. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. అయితే.. తాజాగా హైదరాబాద్ నుంచి వేర్వేరు కార్లలో వంశీ గన్నవరం వస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఖాకీలు అప్రమత్తమయ్యారు. ఆయనను ట్రాక్ చేయడం ప్రారంభించారు. ఇదే సమయంలో వంశీ వేరే మొబైల్ ఉపయోగిస్తున్నారని గుర్తించారు. చివరి వరకు వాహనాన్ని అనసరించి వచ్చిన పోలీసులు.. గన్నవరంలోని ఆయన ఇంటికి సమీపంలోనే అదుపులోకి తీసుకున్నారు.
వాస్తవానికి వంశీ హైదరాబాద్‌లో లేరని, అమెరికా వెళ్లిపోయారంటూ ప్రచారం జరిగింది. కానీ, పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ గట్టిగా నిఘా పెట్టారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం… ఆయన్ను కోర్టులో హాజరు పరిచే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 18 మందిని ఖాకీలు అరెస్ట్ చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా.. ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయన్న ఆరోపణలు విన్పించాయి.
ఎన్నికల ముందు వరకు వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండడం, వంశీకి అత్యంత సన్నిహతంగా మెలిగిన పోలీసులు కీలక స్థానాల్లో ఉండడంతో ఎలాంటి చర్యలు అప్పట్లో తీసుకోలేదని విమర్శలు గుప్పించారు విపక్ష నేతలు. ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారి ఆటకట్టించడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే వంశీ అరాచకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
గతంలో టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని, అందుకు కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. జులై 9న బావులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని, ఆ తర్వాత మరో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. తాజాగా.. వంశీ అనుచరుడు యూసుఫ్ పఠాన్‌ను అరెస్ట్ చేశారు. మరో అనుచరుడు రమేష్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.