శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట కారు షెడ్ లోనే ఆయన సతీమణి దువ్వాడ వాణి, కుమార్తెలు నిరసన తెలుపుతున్నారు. వాణి నిరసన 16వ రోజుకు చేరుకుంది. తనకు ఎటువంటి ఆస్తి వద్దని, దువ్వాడ శ్రీనుతో కలిసి ఉండటానికి తాను, పిల్లలు సిద్ధంగా ఉన్నారని వాణి చెబుతోంది. అయితే, శ్రీనివాస్ మాత్రం తనకు విడాకులే కావాలని అంటున్నారు. తన ఇంటి వద్ద నిరసన చేస్తున్న వారిని ఖాళీ చేయించాలని శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఆయన స్నేహితురాలు అని చెప్పుకొంటున్న మహిళ వ్యాఖ్యలు,. తీరు వివాదాస్పదం కావడంతో పార్టీపై ఒత్తిడి పెరిగింది. దీంతో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది.
దువ్వాడ శ్రీనివాస్ – వాణి వివాదంపై వైసీపీ అధిష్టానం స్పందించింది. వాణి నిరసన తెలుపుతున్న ఇంటి వద్ద టెక్కలి వైసీపీ కార్యాలయం అని దువ్వాడ శ్రీనివాస్ బోర్డు పెట్టాడు. వివాదాస్పద ఇంటిపై వైసీపీ బోర్డు పెట్టడంతో.. కుటుంబ వివాదంలోకి పార్టీని లాగడంపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయింది. టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను మారుస్తూ పార్టీ అధినేత జగన్ ప్రకటన విడుదల చేశారు.
టెక్కలి నియోజకవర్గం నూతన ఇంచార్జిగా పేరాడ తిలక్ ను వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో పార్టీ అధిష్టానం నుంచి దువ్వాడ శ్రీనివాస్ కు గట్టి షాక్ తగిలినట్లయింది. వాణి – శ్రీనివాస్ వివాదంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుండటంతో కుటుంబ పెద్దలు వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరు వర్గాలు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించాయి.