స్వతంత్ర, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రెజ్లర్ల ఆందోళనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ ఆందోళనను జూన్ 15వ తేదీ వరకు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటిలోగా బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోకుంటే తిరిగి నిరసన కొనసాగిస్తామని స్పష్టంచేశారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్ల చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా రెజ్లర్లు ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్లపై ఈనెల 15 వరకు గడువు కావాలని.. అప్పటి వరకు ఆందోళన విరమించాలని అనురాగ్ రెజ్లర్లకు సూచించారు. దీంతో సానుకూలంగా స్పందించిన రెజ్లర్లు ఆందోళనను వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
రెజ్లర్లతో భేటీ సానుకూలంగా ముగిసిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రెజ్లర్ల ఆరోపణలకు సంబంధించి జూన్ 15వ తేదీలోగా పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేస్తారన్నారు. అలాగే రెజ్లర్లపై ఉన్న అన్ని ఎఫ్ఐఆర్‌లు వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా తమపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాంటూ రెజ్లర్లు కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.


