స్వతంత్ర, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజర్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. శనివారం అర్ధరాత్రి ఈ సమావేశం జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీలో రెజ్లర్లు బజ్‌రంగ్ పునియా, సాక్షి మలిక్, సంగీతా ఫొగాట్, వినీశ్ ఫొగాట్, సత్యవర్త్ కడియన్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
బ్రిజ్‌భూషణ్ మీద వచ్చిన లైంగిక ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. దీంతో చట్టం ముందు ఎవరైనా సమానమే అని షా రెజ్లర్లతో అన్నట్లు సమాచారం. కేంద్రమంత్రితో భేటీ అయిన మాట వాస్తవమని.. అంతకుమించి ప్రస్తుతానికి ఇంకేమీ చెప్పలేనని బజ్‌రంగ్ పునియా తెలిపారు. తమపై లైంగిక వేధింపులకు బ్రిజ్‌భూషణ్ పాల్పడ్డారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కొన్నిరోజులుగా రెజ్లర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


