ప్రపంచ వ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు అనిపిస్తోందని మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా- ఉక్రెయిన్, మరోపక్కన ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధాలలో లక్షలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు శాంతి మార్గం వైపు కదలాలన్నారు. అందుకు బుద్ధుని బోధనలు ఆచరించాలని గుత్తా కోరారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లోని బుద్ధవనంలో బుద్ధ దమ్మ విజయం వేడుకలలో గుత్తా పాల్గొన్నారు. రాజ్యకాంక్ష విస్తరించిన తరుణంలో అశోకుడు బౌద్ధం స్వీకరించి శాంతిమార్గం అనుసరించారని సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పర్యాటకశాఖ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, ఎండీ ప్రకాష్‌రెడ్డి, సెంట్రల్ వర్సిటీ విద్యార్థులు వేడుకలకు హాజరయ్యారు.


