స్వతంత్ర వెబ్ డెస్క్: వన్డే ప్రపంచకప్ 2023(World Cup)లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్(India)కు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్(Bangladesh)తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు పాండ్యా దూరమైనట్లు ఐసీసీ(ICC) వెల్లడించింది. అతడి స్థానంలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ(Prasiddh Krishna)ను జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొంది.
వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా ఉన్న టీమిండియా(Team India)కు బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్(Bangladesh)తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ భారత జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(All-rounder Hardik Pandya) టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్వదేశంలో జరుగుతున్న మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించాడు.
టోర్నీలో భాగంగా నాలుగో మ్యాచ్‌లో భారత్ ఆక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసే సమయంలో బ్యాటర్ కొట్టిన బంతిని ఆపే క్రమంలో పాండ్యా అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో అతడి కాలుకు గాయమైంది. చీలమండ గాయానికి(Ankle injury) చికిత్స కోసం పాండ్యా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(National Cricket Academy)కి వెళ్లిపోయాడు. గాయాన్ని పరీక్షించిన అనంతరం టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే పాండ్యా(Pandya) దూరం అవుతాడని మేనేజ్‌మెంట్ చెప్పింది. సెమీఫైనల్ కంటే ముందే జట్టుతో చేరతాడని పేర్కొంది. కానీ గాయం తీవ్రత కారణంగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది.
ఇక టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు హార్దిక్ పాండ్యా(Hardik Pandya) దూరమైనట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ధృవీకరించింది. అతడి స్థానంలో యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ(Prasiddh Krishna)ను జట్టులోకి తీసుకుంది భారత్. పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చినట్లు టోర్నమెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కలిపి మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. అంతకుముందు మూడు మ్యాచుల్లో ఐదు వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్(Bangladesh)తో మ్యాచ్‌లో మూడు బంతులు మాత్రమే వేశాడు. ఇక పాండ్యాకు ఈ టోర్నీలో ఒకసారి మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అందులో 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
స్వదేశంలో జరుగుతున్న మెగా టోర్నీలో ఆడిన 7 మ్యాచుల్లోనూ గెలిచిన భారత్.. సెమీస్ చేరింది. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నవంబర్ 5న సౌతాఫ్రికా, నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. టోర్నీలో హార్దిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ సేవలు కోల్పోవడంతో జట్టుకు నిరాశ కలిగించేదే. అయితే జట్టులోని మిగతా వారంతా ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ప్రసిధ్ కృష్ణ (Prasiddh Krishna)విషయానికి వస్తే.. అతడు ఇప్పటి వరకూ భారత్ తరఫున 17 వన్డేలు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. చివరిసారిగా వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో రెండు వన్డేల్లో ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ(Syed Mushtaq Ali) ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడుతోన్న ప్రసిద్ధ్ కృష్ణ ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. భారత్ లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్‌లను సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లతో ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో బుమ్రా లేదా సిరాజ్‌కు విశ్రాంతి కల్పించి ప్రసిధ్‌ను ఆడించే అవకాశం ఉంది.
ఇక ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా జట్లు వన్డేల్లో ఇప్పటి వరకు 90 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 50 మ్యాచుల్లో గెలుపొందగా, దక్షిణాఫ్రికా 37 మ్యాచుల్లో విజయం సాధించింది. 3 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఇక వన్డే ప్రపంచకప్ మ్యాచుల విషయానికి వస్తే.. ఇరు జట్లు ఇప్పటి వరకు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా మూడు మ్యాచుల్లో విజయం సాధించగా, భారత్ రెండు మ్యాచుల్లో గెలిచింది. 2003 నుంచి 2019 వరకు వరల్డ్ కప్లో గెలుపు ఓటములు చూసుకుంటే.. 3 సార్లు ఇరు జట్లు తలపడ్డాయి. ఇందులో రెండు టీమిండియా గెలుపొందగా, ఓ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. చూడాలి.. మరీ ఈ ప్రపంచకప్‌లో భారత వరుస విజయాల జైత్ర యాత్రకు సౌతాఫ్రికా బ్రేక్ వేస్తుందా..? లేక టీమ్ఇండియా తన గెలుపు యాత్ర కొనసాగుతుందో.