కడప అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. అలాంటి కడప అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యే అంజాద్ బాషా హ్యాట్రిక్ కొడతారా.. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సాధించిన అభివృద్ధి ఏంటి..? కడపలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది…?
దేవుని తొలి గడప కడప. రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ఈ పట్టణానికి ఎంతో పేరుంది. అలాంటి కీలక స్థానంలో పదేళ్లుగా శాసనసభ్యునిగా ఉన్నారు అంజాద్ బాషా. కాంగ్రెస్ కార్పొరేటర్ గా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన… జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశాక అందులో చేరారు. 2014 లో అనూహ్య రీతిలో పార్టీ టికెట్ దక్కించుకుని కడప ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కడపలో ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీనివల్ల అభివృద్దికి అవకాశం లేకుండా పోయిందని అంజాద్ బాషా విమర్శలు చేశారు. 2019లో అంజాద్ బాషా 52వేల 539 ఓట్లతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడటంతో డిప్యూటీ సిఎం పదవి ఆయనను వరించింది. మంత్రి వర్గ విస్తరణలో అంజాద్ బాషాను రెండో సారి తప్పిస్తారని అంతా భావించినా… అధినేత జగన్ కడప ఎమ్మెల్యేకు మరో అవకాశం కల్పించారు..
కడప నియోజకవర్గ అభివృద్దికి ఇప్పటివరకు 2400 కోట్లను వైసీపీ ప్రభుత్వం కేటాయించిందని చెబుతున్నారు ఎమ్మెల్యే అంజాద్ బాషా. అందులో రోడ్లు, కూడళ్ళు, డ్రైనేజీ, చెరువుల సుందరీకరణ, తాగునీటి ఎద్దడి శాశ్వత నివారణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పార్కులు, శ్మశాన వాటికలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, రిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి, బుగ్గవంక ఆధునీకరణ పనులు, పాఠశాలల అభివృద్దికి ఈ నిధులు ఖర్చు చేశామని వెల్లడిస్తున్నారు. సంక్షేమానికి 1879 కోట్లు ఇచ్చామని… ఈ సంక్షేమం, అభివృద్ధే రానున్న ఎన్నికల్లో తనను మళ్ళీ గేలిపిస్తాయని అంజద్ బాషా ధీమాగా ఉన్నారు. కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా వల్లిస్తున్న అభివృద్ధి మాటలను… ఆయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి తప్పుబ డుతున్నారు. అభివృద్ధి పేరిట ఆయన తన సొంత ఆస్తులు పెంచుకున్నారే తప్ప… నియోజక వర్గంలో జరిగింది ఏమీ లేదని మండిపడుతున్నారు. అభివృద్ధి అంటే కూడళ్లలో విగ్రహాలు పెట్టడం కాదని.. ప్రజల కనీస సౌకర్యాలు తీర్చడం అని మాధవిరెడ్డి కౌంటర్ ఇస్తున్నారు..అభివృద్ధి అంటే నాయకులు సంకల్పించింది కాదు. ప్రజలు కోరుకున్నది. వారికి కావాల్సింది. మరి కడపలో అలాంటి అభి వృద్ధి జరిగిందా..? అంటే ఓటర్ల నుంచి లేదనే సమాధానమే వస్తోంది. ఐదేళ్లు అధికారపక్షం ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్ బాషా నియోజకవర్గ ప్రజలకు చేసింది పెద్దగా ఏమీ లేదని స్థానికులు అంటున్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, వేసవి కాలం వస్తే తాగునీటికి తల్లడిల్లిపోతున్నా మని ప్రజలు అంటున్నారు. బుగ్గవంక కార్పెట్ వాల్ కు వెయ్యి కోట్లు నిధులు తెచ్చామన్న డిప్యూటీ సిఎం ఇంత వరకు వాల్ ను పూర్తి చేయలేదని విమర్శిస్తున్నారు. కడపలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందు లు పడుతున్నామని ఓటర్లు వాపోతున్నారు.
కడప నియోజకవర్గంలో జరిగిన పనులు గోరంతలు ఉంటే.. జరగాల్సినవి కొండంతలు ఉన్నాయని ఓటర్లు అంటు న్నారు. అభివృద్ధి పేరుతో వచ్చిన నిధులు ఎటు వెళ్లాయో అర్థం కావడం లేదంటున్నారు. ఎమ్మెల్యే అంజాద్ బాషా నిరంతరం ప్రజల్లో ఉంటూనే… ఆస్తులు కూడా అదే స్థాయిలో కూడబెట్టుకు న్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన తమ్ముడు అహ్మద్ బాషా , అల్లుడు ఉమర్ కనుసన్నల్లో అన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయని ధనార్జనే ధ్యేయంగా వారంతా పనిచేస్తున్నారని జనం విమర్శిస్తున్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ పనులకు సైతం అంజాద్ బాషాకు కమిషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొని ఉందని అంటున్నారు. నియోజకవర్గంలోని వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని చూస్తే అంజాద్ బాషాకు పాస్ మార్కులు ఇవ్వడం కష్టమేనని అంటున్నారు కడప ఓటర్లు. ఐదేళ్ల పనితీరు ఆధారంగా అంజాద్ బాషా ఎమ్మెల్యేగా ఫెయిలయ్యారన్న అభిప్రాయాలే ఎక్కువ గా వినిపిస్తున్నాయి. కడప అసెంబ్లీ నియోజకవర్గ చరిత్ర చూసుకుంటే ఏ అభ్యర్థి రెండు సార్లకు మించి ఎమ్మెల్యేగా గెలవలేకపోయారన్న సెంటిమెంట్ బలంగా ఉంది. దీనికి తోడు ప్రజల నుంచి కూడా అంజాద్ బాషాకు ఏమంత అనుకూలమైన స్పందన లేదు. మరి ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన గట్టెక్కుతారో లేదో చూడాలి..


