AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉంది. అయినప్పటికి ఇప్పటినుంచే రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత.. రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక వర్గం ఓ రకమైన ప్రచారాన్ని.. అనుకూల వర్గం మరో రకమైన ప్రచారాన్ని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిజంగా సెమీఫైనల్సేనా.. ఈ ఎన్నికలు వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయా అనే ప్రశ్నలు మాత్రం ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మరోవైపు ఈఫలితాలు 2024 సాధారణ ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపవని.. 175కు 175 స్థానాలు వైసీపీవేనని ఆ పార్టీ నాయకులు జోస్యం చెబుతున్నారు. అసలు అధికార, ప్రతిపక్షాల వ్యాఖ్యలు అటుంచితే.. అసలు వీటిలో ఏది వాస్తవం.. ఏది అవాస్తంవం అనేది గమనిస్తే.. శాసనసమండలి ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా.. సమాజంలోని వివిధ వర్గాల తరపున శాసనసమండలికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా.. ఆ వర్గం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే కొంతకాలంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం పెరిగిపోయింది. అయినప్పటికి పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ప్రతినిధిని రాజకీయాలకు అతీతంగా ఎన్నుకుంటూ వచ్చారు. కాని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులే విజయం సాధించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ విజయం సాధించగా.. పట్టభద్రుల స్థానం నుంచి టీడీపీ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే అధికారపక్షానికి గ్రాడ్యుయేట్లు షాకిచ్చారనేది సుస్పష్టం.. అయితే తమకు పట్టభద్రుల మద్దతు ఉంది కదా అనే అతి విశ్వాసంతో టీడీపీ ఉంటే ఆ పార్టీకి తీవ్ర నష్టం తప్పదనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
AP Politics: ఉత్తరాంధ్రా పట్టభద్రుల స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ బలపర్చిన చిరంజీవి రావు సుదీర్ఘకాలం అధ్యాపక వృత్తిలో ఉండటమే కాకుండా.. విశాఖపట్టణంలోనే అతి పెద్ద ప్రభుత్వ కళాశాలల్లో ఒకటైనా కృష్ణా కాలేజీలో పనిచేయడం.. అలాగే ఎంతో మందికి సివిల్స్, గ్రూప్స్ కోచింగ్ ఇవ్వడం ద్వారా అనేకమందికి సుపరిచితం. ఇదే సమయంలో పిడిఎఫ్ బలపర్చిన అభ్యర్థి కె.రమాప్రభకు వ్యక్తిగతంగా గుర్తింపు లేకపోయినా.. ఉద్యోగ, కార్మిక సంఘాల మద్దతు ఉండటంతో ప్రధాన పోటీదారురాలిగా నిలిచారు. కాని రెండు రాజకీయ పార్టీల పోరులో ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యారు. మరోవైపు.. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ టీడీపీ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారు. ఇదే ఫలితం రానున్న సాధారణ ఎన్నికల్లో వస్తుందని పక్కాగా చెప్పలేము. ఎందుకంటే విద్యావంతులు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే సాధారణ ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన వయోజనులంతా ఓటు హక్కు వినియోగించుకుంటారు. దీంతో ఫలితం ఇలాగే ఉంటుందని చెప్పలేము. 2019 సాధారణ ఎన్నికలతో పాటు.. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేకుండా పోయింది. దీంతో పట్టభద్రులు ప్రభుత్వానికి ఓ షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలా అనుకున్నప్పటికి.. మొత్తం ఓటర్లలో 50 నుంచి 60 శాతం లోపు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతా వాళ్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోలైన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థికి నమోదుకాలేదు. రెండె ప్రాధాన్యత ఓటుతో మాత్రమే మూడు పట్టభద్రుల స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందారు. అదే సాధారణ ఎన్నికల్లో అయితే శాతాలతో సంబంధం లేకుండా ఏ అభ్యర్థి ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలిగితే ఆ అభ్యర్థి విజయం సాధించినట్లు. అందుకే ఈ రెండు ఎన్నికలకు ఎంతో తేడా ఉందనేది గమనించాల్సి ఉంటుంది.
AP Politics: పట్టభద్రుల ఎన్నికల ఫలితాలను బట్టి ప్రజల మూడ్‌ను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పూర్తిస్థాయిలో కాకపోయినప్పటికి గ్రామంలో కనీసం పది మందైనా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వారి తీర్పు ఆధారంగా ఏపీ ప్రజల మూడ్‌ను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది రాజకీయ పరిశీలకుల మాట. అందుకే ఈ ఫలితాన్ని చూసి విర్రవీగడం అంత మంచిది కాదని సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ ఫలితం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..