ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. తాజాగా టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో ను ప్రజల ముందుకు తెచ్చారు.
యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి రైతుకు ఏటా 20 వేల రూపాయల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజధానిగా అమరావతి కొనసాగింపు.. ఇలా అనేక హామీలతో ప్రజల ముందుకు వచ్చింది టీడీపీ కూటమి మేనిఫెస్టో. అయితే ఇక్కడే ఒక ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేనిఫెస్టో టీడీపీ, జనసేనదేనని కామెంట్ చేశారాయన. అదే సమయంలో కమలం మద్దతు తమ హామీపత్రానికి ఉందని తెలిపారు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీ యాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం, పేదల సంక్షేమమే అజెండాగా సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల ముందుకు వచ్చామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అలాగే లోక్‌సభ ఎన్నికల వేళ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరందరి సమక్షంలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రజల ముందుకు వచ్చింది.
భవిష్యత్ ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మేనిఫెస్టో రూపొందించినట్లు వెల్లడించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై ఘాటు ఆరోపణలు చేశారు పవన్. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని జగన్మోహన్ రెడ్డిపై పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా అమరావతి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రజారాజధాని అమరావతిని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశారని జనసేనాని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనకు తెరవేయడానికి టీడీపీ కూటమి ముందుకొ చ్చిందన్నారు పవన్ కల్యాణ్.
పేరుకు ఉమ్మడి మేనిఫెస్టోనే అయినా ఇందులో బీజేపీ ప్రమేయం లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు చేసే బాధ్యత టీడీపీ జనసేనదేనని చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీకి స్థానికంగా హామీపత్రాలు ఉండవని చెప్పుకొ చ్చారు. అదే సమయంలో ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉందని ప్రకటించారు చంద్రబాబు. ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పేరుతో తెలుగుదేశం పార్టీ ఆరు ప్రధాన హామీలు ఇచ్చారు. కాగా షణ్ముఖ వ్యూహంతో జనసేన ప్రజాకర్షక హామీలు ప్రకటించింది.
టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో అనేక కీలక హమీలున్నాయి. రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఉమ్మడి మేనిఫెస్టో హామీ ఇచ్చింది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు నెలల కిందట రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. తెలంగాణ వాసులమన్న ఆధార్ కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం సూపర్ డూపర్‌గా హిట్ అయింది. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉచిత బస్సు ప్రయాణం అంశాన్ని మేనిఫెస్టోలో చేర్పించింది ఉమ్మడి మేనిఫెస్టో.
గృహిణులను ఆకట్టుకోవడానికి మరో హామీ ఇచ్చింది. దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ కూటమి పేర్కొంది. ఇటీవలి కాలంలో ఉచిత సిలిండర్ల అంశం …మేనిఫెస్టోలో తరచుగా చోటు చేసుకుంటోంది. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని స్పష్టం చేసింది టీడీపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో. అలాగే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టో హామీ ఇచ్చింది. అలాగే నిరుద్యోగ యువతను ఆకట్టుకోవ డానికి మరో హామీ ఇచ్చింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం అంటే మాటలు కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ యావత్ యువత ఈ హామీతో తమకు అనుకూలంగా వ్యవహరిస్తారని టీడీపీ కూటమి లెక్కలు వేస్తోంది. నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల భృతి ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టో పేర్కొంది. నిరుద్యోగులకు భృతి ఇవ్వడమనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఈ డిమాండ్‌ను తాము అమలు చేస్తామని తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో హామీ ఇచ్చింది.
భావి భారత పౌరులపై కూడా హామీలు కురిపించింది టీడీపీ కూటమి. స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది ఉమ్మడి మేనిఫెస్టో. తాగునీటి సమస్యకు ఉమ్మడి మేనిఫెస్టో టాప్ ప్రయారిటీ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఉచిత నల్లా కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. వృద్ధాప్య పెన్షన్లను నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు. దివ్యాంగులకు ఆరువేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బీసీలకు యాభై ఏళ్లు రాగానే నెలకు నాలుగు వేలు పెన్షన్ గా ఇస్తామని తెలిపారు. వీటితోపాటు మరిన్ని హామీలిచ్చారు మేనిఫెస్టోలో. రెండు వారాల్లోగా జరగనున్న ఎన్నికల్లో ఈ పథకాలు, హామీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఏ మేరకు ఓట్లు సాధించి పెడుతుందన్నది వేచి చూడాల్సిందే.


