తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రస్తుతం ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో రాష్ట్రాన్ని పాలించి బాధ్యాతాయుతమైన నాయకుడు కేసీర్ అసెంబ్లీకి రావడం లేదంటూ పిటిషన్ దారుడు కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు.. ఆయన సభకు వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ వేసింది విజయ్ పాల్ అనే సామాజిక ఉద్యమకారుడు. దీనిని విచరణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఏం చేయాలి అని ప్రశ్నించింది.
కేసీఆర్.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలైంది. అయితే ఆయన ఎమ్మెల్యేగా మాత్రం విజయం సాధించారు. ఆయన అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కూడా. అయితే ఆయన సభకు మాత్రం రావడం లేదు. ఇది వాస్తవం. దీనిపై అటు సభలోనూ.. ఇటు రాజకీయంగానూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన రాకపోయినా బీఆర్ఎస్ పార్టీ నేతలు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు.
గత ఏడాది బడ్జెట్ సందర్బంగా కేసీఆర్ సభకు వచ్చినా.. కొద్ది సేపు ఉండి వెళ్లిపోయారు. బయట మీడియాతో మాట్లాడారు. ఇక తర్వాత మళ్లీ అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇదే సమయంలో అవకాశం దొరికినప్పుడల్లా అధికార పక్షం ఆయనను సభకు రావాలని ప్రశ్నించడం.. కేసీఆర్ రాకపోవడం షరామామూలే అయింది.ఈ నేపథ్యంలోనే విజయ్ పాల్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసీఆర్ సభకు వచ్చేలా ఆదేశించాలని కోరారు. అయితే పిటిషన్‌పై విస్మయం వ్యక్తం చేసిన కోర్టు.. ఇది తమ పరిధిలో ఉందా అంటూ ప్రశ్నించింది. దీనిపై పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తమకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదిలావుంటే.. అసెంబ్లీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది మాత్రం.. అసలు ఈ వ్యాజ్యం కొట్టేయాలని కోరారు. ఇక కేసీఆర్ తరఫున ఎవరూ వాదనలు వినిపించలేదు. ఆయనకు నోటీసులు పంపించిన తర్వాతే.. ఆయన తరఫున వాదనలు వినే అవకాశం ఉంటుంది. ఇదిలావుంటే.. ఒక ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదని పేర్కొంటూ దాఖలైన రెండో పిటిషన్ ఇది. గతంలో బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఇదే తరహాలో పిటిషన్ దాఖలైంది. అయితే.. ఇది స్పీకర్ పరిధిలోని అంశం అంటూ బీహార్ హైకోర్టు అప్పట్లో ఈ పిల్‌ని కొట్టేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు కేసీఆర్ పై సభకు రావడం లేదంటూ పిటిషన్ దాఖలైంది. ఇక కోర్టు ఏం చెబుతుందో చూడాలి.