33.2 C
Hyderabad
Wednesday, February 12, 2025
spot_img

భారతీయులకు సంకెళ్లు వేసినా మోదీ ఎందుకు స్పందించలేదు?

ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, నాలుగో అతిపెద్ద సైనిక వ్యవస్థ… చెప్పుకోవడానికి బాగానే ఉన్నా.. భారత్ పరపతి ఇంకా ఆ స్థాయికి ఎదగడం లేదు. మోడీ రాజ్యంలో భారత్ ముందు ప్రపంచం మోకరిల్లుతుందని.. నమో భక్తులు చేస్తున్న భజనలు.. భజనలే అని రుజువు అవుతున్నాయి. అమెరికా మన దేశ పౌరులకు పడిన సంకెళ్లు.. మన దేశ పరపతిని ఎత్తి చూపుతున్నాయి. ఇంత జరిగినా సరే…. మోడీ మౌనం వహించారే తప్ప ఒక్కంటే ఒక్క మాట మాట్లాడలేదు. అయిననూ పోవలెను అమెరికాకు అన్నట్లు తన ప్రాణమిత్రుడు ట్రంప్ ను కౌగిలించుకునేందుకు అమెరికాలో పర్యటిస్తున్నారు మోడీ .

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు… దోస్తు.. దోస్తే.. దేశం దేశమే అని ట్రంప్ అంటున్నారు. వలసదారులు ఏ దేశానికి చెందినవారైనా సరే సంకెళ్లు వేసి పంపిస్తామని నిరూపించారు. అయితే ఈ విషయంలో కొలంబియా వంటి చిన్న దేశానికి ఉన్న పౌరుషం కూడా భారత్ కు లేకపోయింది. విదేశీ యుద్ధం విమానం మన దేశ గడ్డపై దిగడం వారి అధిపత్యానికి పరాకాష్ట అని తెలిసినా.. భారత్ మిన్నకుండి పోయింది. ఇంత జరిగినా.. మోడీ అమెరికా వెళ్లి ట్రంప్ ను ఆలింగనం చేసుకోవడం వెనుక అసలు కారణం వెరే ఉంది.

మోడీ అమెరికా పర్యటన ప్రారంభమైంది. ఈ పర్యటనలో అక్రమవలసదారుల విషయం ప్రధానంగా చర్చకు వస్తుందని ప్రచారం జరుగుతున్నా..వాస్తవాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మోడీ కాదు కదా.. ఏ దేశాధినేత చెప్పినా వినిపించుకునే స్థితిలో ట్రంప్ లేరన్న చర్చ జోరుగా సాగుతోంది. అసలు మోడీ అమెరికా పర్యటనలో వలసదారుల అంశమే లేదని తెలుస్తోంది. అక్రమ వలసదారుల నెపంతో 104 మందిని అమెరికా సైనిక విమానంలో గొలుసులతో కట్టేసి ఇండియాకు పంపించింది అమెరికా. ఈ ఘటన భారత్ లో తీవ్ర ఆగ్రహాన్ని, ఆవేదనకు, ఆందోళనకు దారి తీసింది. భారత్ లోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలసదారులు అమెరికాకు విద్యార్థులుగా, చిన్న చిన్న ఉపాధి అవకాశాల కోసం వెళ్లారు. వీరిని నేరస్థుల్లా నిర్బంధించి, అమెరికా సైనిక విమానంలో గొలుసులు వేసి పంపడం ట్రంప్ క్రూరత్వానికి అద్దం పడుతోంది. ఈ చర్యతో భారత్ పరువు ప్రతిష్ఠ, పరపతి ప్రపంచ వేదికపై దిగజారిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చకు పట్టుబట్టినా… బీజేపీ సర్కార్ మౌనం పాటించింది. అమెరికాలోని భారతీయ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు అమానవీయమైనవని విపక్ష పార్టీలు అంటున్నాయి. వలసదారుల శ్రమతో సంపన్న రాజ్యంగా ఎదిగిన అమెరికా… ఇప్పుడు వలసదారులకు గొలుసులు వేసి స్వదేశాలకు పంపడం… దాన్ని భారత్ ఖండించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అమెరికాలో చట్టబద్ధంగా కాకుండా నివసిస్తున్న భారతీయుల సంఖ్య 7.25 లక్షలకు పైగా ఉందని ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. ఈ సంఖ్య మెక్సికన్లు, ఎల్‌సాల్వడోరియన్ల తరువాత మూడోస్థానంలో ఉంది. ట్రంప్ ప్రభుత్వం కఠినమైన వలస విధానాలను అనుసరించి భారతీయులను టార్గెట్ చేయడం మన దేశానికి పెద్ద అవమానం. మన దేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా, ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో చక్రం తిప్పుతుంటే… భారత్ కు చెందిన వలసదారులను సంకెళ్లతో అవమానించి పంపించడం భారత పరపతిని తక్కువ చేయడమేనని విశ్లేషకులంటున్నారు. అంతేకాదు, ప్రధాని మోడీ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా గొప్పలు చెప్పుకుంటారు. పైగా ట్రంప్ విజయం కోసం అమెరికాలో భారతీయ ఓటర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు.

భారత్​కు అమెరికా మిత్ర దేశమని గొప్పగా చెప్పుకొంటున్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం భారతీయుల పట్ల అమానవీయంగా, క్రూరంగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రధాని మోదీ తాజా అమెరికా పర్యటన, గతంలో మోదీ, ట్రంప్​ మధ్య ఉన్న సాన్నిహిత్యం, తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించినప్పుడు మోదీ ఆయనను ప్రియమిత్రుడిగా సంబోధిస్తూ అభినందన సందేశం పంపడం ఇవన్నీ గమనించిన వారికి అమెరికా సర్కార్ వైఖరి సహజంగానే ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ విషయంలో మన ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా విమర్శలకు గురవుతోంది. ఈ 104 మందిని అక్రమ వలసదారులుగా పేర్కొంటూ భారత్​కు తిప్పిపంపనున్న విషయం కేంద్రానికి ముందే తెలుసు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతే వారిని అమెరికా తిప్పి పంపింది. అలాంటప్పుడు వారిని తీసుకు రావడానికి మోదీ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపొచ్చు కదా? గతంలో ఉక్రెయిన్లో, గల్ఫ్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి డజన్ల సంఖ్యలో ప్రత్యేక విమానాలను ప్రభుత్వం పంపించింది. మరి ఇప్పుడు ఎందుకు పంపలేదనేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్​టైం ఉద్యోగాలు చేస్తే తప్ప అక్కడ జీవించే పరిస్థితి లేదు. అమెరికా పంపేందుకు ఇక్కడ బ్యాంకుల ద్వారా 25 లక్షల నుంచి 50 లక్షల వరకు అప్పు చేసి ఇంకా కొంతమంది ఆస్తులు తాకట్టు పెట్టి విదేశాలకు పంపించారు. చదువు పూర్తయిన తర్వాత కూడా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసి ఏదో ఒక కంపెనీలో పని చేస్తూ కొంతలో కొంత మిగుల్చుకుని తల్లిదండ్రులకు పంపేవారు. ఇక్కడి తల్లిదండ్రులు వారి పిల్లల ఖర్చుకు చేసిన అప్పులకు జమ చేస్తూ ఉండేవారు. చదువు కోసం వెళ్లిన వారు కూడా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ తల్లిదండ్రులకు భారం కాకుండా చూసుకునే వారు. కానీ ఇప్పుడు విద్యార్థులు పార్ట్ టైం ఉద్యో గాలు చేయడానికి వీలు లేదని ట్రంప్ నిబంధనలు పెట్టడంతో ఇక్కడి నుంచి నెలకు 60వేల నుంచి 80వేలు పంపించాల్సి వస్తుంది. అమెరికాలో కనీస జీవనానికి 700 నుంచి 800 డాలర్లు అవసరం అవుతాయని అంచనా. అట్లాంటా, ఓహయో, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూయార్క్, చికాగో, డల్లాస్​ల్లో తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు. కేవలం పార్ట్ టైం ఉద్యోగాలు చేయనివ్వకుండా నిషేధించడం ఇక్కడి తల్లిదండ్రులకు పెనుభారంగా మారింది.

భారత ప్రభుత్వం అమెరికాకు సహకరిస్తున్నప్పటికీ, ట్రంప్ దానిని పట్టించుకోకుండా భారతీయులను అవమానపరుస్తూనే ఉన్నాడు. అయినా ట్రంప్ నా మిత్రుడు అని చెప్పుకుని తిరిగే మోడీ మాత్రం ఈ అంశంపై స్పందించడానికే ఇష్టపడటం లేదు. ట్రంప్ భారతీయులకు సంకెళ్లు వేసి ఇంటికి పంపి నెల రోజులు గడవక ముందే తన ప్రాణమిత్రుడిని కలిసేందుకు మోడీ అమెరికా వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. భారత పౌరులకు సంకెళ్లు వేయడం అంటే… కేవలం వ్యక్తులపై కాదు, భారత్ పట్ల కూడా ఇది అవమానకరమైన చర్య అని విశ్లేషకులంటున్నారు. ఇది కేవలం భారతీయుల సమస్య కాదు. ప్రపంచమంతా ఇలాంటి అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పాలని చెబుతున్నారు. అమెరికా ఎదుగుదలకు కారణం వలసదారులే. అనేక రంగాలలో విజ్ఞానం, పరిశ్రమ, కళ, సాంకేతికత వలసదారులే ప్రధాన పాత్ర వహించారు. కానీ, ట్రంప్ అమెరికా చరిత్రను విస్మరించి, వలసదారుల్ని నేరస్తుల్లా చిత్రించడంలో కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ట్రంప్ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలు ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని, విధానాలను, అగ్రరీతి ప్రవర్తనను ఎదుర్కోవడానికి ప్రపంచం ఒక్కటిగా ఐక్యమవ్వాలి. చిన్న దేశాలను బెదిరించే ట్రంప్ సామ్రాజ్యవాదాన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది. ట్రంప్ పాలన కేవలం వలసదారుల పట్ల ద్వేషంతోనే కాదు, మానవత్వానికి వ్యతిరేకంగానూ నిలిచింది. ఆయన జాత్యహంకార విధానాలు, విస్తరణ వాద కలలు, ఇతర దేశాలపై ఆగ్రహావేశ ధోరణి ప్రపంచ ప్రజలను కలచివేస్తున్నాయి. వలసదారుల పట్ల ద్వేషం చూపిన నేతగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారతీయులకు అవమానకరంగా సంకెళ్లు వేసినా.. స్పందించని భారత ప్రధానిగా మోదీ వీరిద్దరూ చరిత్రలో నిలిచిపోతారు.

Latest Articles

కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్న ఆ ఎమ్మెల్యే?

కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యే గుదిబండలా మారాడా? ఎమ్మెల్యేల బలం పెరుగుతుందని పార్టీలో చేర్చుకుంటే.. ఇప్పుడు పార్టనే ఓడించే స్కెచ్చులు వేస్తున్నాడా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్