పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం ముగిసింది. అభ్యర్ధుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 76.09 శాతం ఓటింగ్ నమోదైంది. భారీ పోలింగ్ జరగడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు.
ఖమ్మం, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగినా.. ప్రధాన పోటీ బీఆర్ ఎస్- కాంగ్రెస్ మధ్యే జరిగింది. ఫలితాలు తేలేందుకు 20 రోజుల సమయం ఉండటంతో అభ్యర్ధుల నుంచి లోతైన విశ్లేషణ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో హస్తం హవా కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి విశ్లేషకులు భావిస్తున్నారు.
ఖమ్మం పార్లమెంటు సీటు ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. తర్వాత టీడీపీ అనంతరం బీఆర్ ఎస్ ఖమ్మం నుంచి విజయం సాధిస్తూ వచ్చాయి. బీజేపీ ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఎన్నడూ గెలవ లేదు. బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు నాలుగు సార్లు నెగ్గి, ఐదో సారి తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. అయిదు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండు నియోజకవర్గాల్లోని మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచింది. దీంతో తర్వాత కాంగ్రెస్ హవానే కొనసాగింది. 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్, సీపీఐ అభ్యర్ధులకు కలిపి దాదాపు 2.42 లక్షల మెజార్టీ రాగా ఇప్పుడు అది తగ్గే సూచనలు కన్పిస్తున్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి, బీఆర్ ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఎవరి విశ్లేషణలు వారివి. గెలుపు తమదేనన్న ధీమా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధుల్లో వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ అభ్యర్ధి రామసహాయం రఘురామరెడ్డి గెలుపు తమదేనని చెబుతున్నారు. గెలుపు ఖాయమని లక్ష నుంచి లక్షా 50 వేల ఓట్ల మెజార్టీ ఖాయమనే అంచనాకు ఆ పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీలు, ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, కేడర్ ఉండటం, బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉండటం తమకు కలిసి వస్తాయనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.
బీఆర్‌ఎస్ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు కూడా ఓటింగ్ సరళి బట్టి చూస్తే తమకే అనుకూలంగా ఉందనే భావన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు భారీ స్పందన రావడం, ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలం గా ఉంటుందనే ధీమా బీఆర్‌ఎస్ నేతల్లో ఉంది. ఇక బీజేపీ అభ్యర్ధి తాండ్ర వినోద్‌రావు తన గెలుపుపై లెక్కలు వేయడంలో మునిగారు. మోదీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పథకాలు తమకు ఓట్లు కురిపిస్తాయని ఆశాభావంతో ఉన్నారు. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో 82.08 శాతం, 2014 ఎన్నికల్లో 82.13 శాతం పోలింగ్ నమోదైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు 5 లక్షల67వేల459 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకా చౌదరికి 3లక్షల99వేల 397 ఓట్లు వచ్చాయి. ఇక సీపీఎం అభ్యర్ధి బోడా వెంకటేష్‌కు 57వేల 102 ఓట్లు పొందగా బీజేపీ అభ్యర్ధి దేవకి వాసుదేవ రావుకు 20,488 ఓట్లు వచ్చాయి. ఈ సారి సీపీఎం కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫలితాలపైకాంగ్రెస్ భారీ అంచనాలతో ఉంది.


