జగత్ ప్రకాశ్ నడ్డా…ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే జేపీ నడ్డా అంటే తెలియనివారుండరు. భారతీయ జనతా పార్టీకి జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడున్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే జేపీ నడ్డా పదవీ కాలం త్వరలో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి బీజేపీ అగ్రనేతలు సన్నద్ధమవుతున్నారు. బీజేపీలో ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికలు ముగిసినవెంటనే బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. దాదాపుగా మార్చి 15 లోగా బీజేపీ కొత్త అధినేత పేరు ప్రకటించే అవకాశాలున్నాయి.
పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సంబంధించి బీజేపీలో కొన్ని నియమ నిబంధనలున్నాయి. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో సదరు ప్రక్రియ పూర్తయింది. కాగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం మరో ఆరు రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం ఈ పనిమీద బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కాగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రణాళికలు చేపట్టింది. మరో వైపు జాతీయ అధ్యక్షుడి పదవికి పేర్లను సూచించవలసిందిగా పార్టీ రాష్ట్రాల ఇన్ చార్జ్ లను బీజేపీ హై కమాండ్ కోరింది.
కాగా 2020లో తొలిసారిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి ఆయన పదవీకాలం కిందటేడాదే ముగిసింది. అయితే, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా, జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించారు. కాగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత జేపీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్పగించారు. కాగా జేపీ నడ్డా వారుసుడెవరు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ సందర్భంగా పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలో ఉండటంతో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి అనేక మంది సీనియర్ నాయకులు ఆసక్తి చూపుతున్నారు.