తెలంగాణ కాంగ్రెస్ కొత్త రథసారథి ఎంపికపై అధిష్టానం ఫోకస్ చేసింది.? ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకొని పేరు ఖరారు చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్య నేతలంతా ఎవరి పేరు ప్రస్తావించారు.? ఇంతకీ అధిష్టానం ఫైనల్ చేయబోయే ఆ నేత ఎవరు.? ఈసారి ఏ సామాజిక వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వబోతోంది.?
తెలంగాణ కాంగ్రెస్‌కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి పదవి కాలం ముగుస్తుం డడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. గత ఐదు రోజులుగా ఢిల్లీలో అగ్ర నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి వరుస భేటీలు అయ్యారు. అదే విధంగా మంత్రులు, కీలక నేతలు కొత్త అధ్యక్షుడి ఎంపికపై తమ అభిప్రాయాలను అధిష్టానం సేకరించింది.
సామాజిక, రాజకీయ అనుభవం లాంటి సమీకరణాలు పరిగణలోకి తీసుకొని అధిష్టానం అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరన్న అంశం తెరపైకి వచ్చిన ప్పటి నుండి బీసీ సామజిక వర్గం నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మధుయాష్కీ గౌడ్, సురేష్ షట్కార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ఎస్టీ సామాజికవర్గం నుండి బలరాం నాయక్ పేరు ఉండగా, ఎస్సీ సామజిక వర్గం నుండి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంపత్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు పీసీసీగా ఉండడంతో మరోసారి లేదని అధిష్టానం ఖరాఖండిగా తేల్చి చెప్పింది. దీంతో ఆయన ప్రయత్నం విరమించుకున్నారు. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా జగ్గారెడ్డి పేరుని అగ్ర నేతలు పరిశీలిస్తున్నట్లు సమచారం.
తెలంగాణ జనాభాలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు న్యాయం జరగటం లేదంటూ అసెంబ్లీ, పార్ల మెంట్ ఎన్నికల సమయంలో టిక్కెట్ల విషయంలో చాలా మంది నేతలు బాహాటంగానే చెప్పుకొచ్చారు. అయిలే పార్టీబలోపేతానికి వ్యూహాత్మకంగానే బీసీ సామాజిక వర్గం వైపు అధిష్టానం అడుగులు వేయాలని భావిస్తున్నట్లు సమచారం. దీంతో అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను పీసీసీ పీఠం ఎక్కించాలని చూస్తోంది. ఈనేపథ్యంలోనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్‌లు ఢిల్లీలో మకాం వేసి మరీ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అధ్యక్ష ఎంపికఫై అధి ష్టానం తీసుకున్న అభిప్రాయ సేకరణలో రాష్ట్ర నేతలంతా మహేష్ కుమార్ గౌడ్ పేరునే సూచించిన్నట్లు తెలుస్తోంది. దీంతో అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్‌ని ఫైనల్ చేసే అవకాశం మొండుగా కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే జులై7వ తేదీ నాటికి ముందే అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రథసారథి తోపాటు తర్వాతి పోజిషన్‌లో ఉండే పదవులను సైతం భర్తీ చేయాలని అగ్ర నాయకత్వం ఆలోచిస్తోంది. మొత్తానికి పీసీసీ అధ్యక్షులు ఎవరన్న ఉత్కంఠకి ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ఈనేపథ్యంలోనే పీసీసీ పదవి ఆశించి భంగపడ్డ నేతలు నిరాశ చెందకుండా పార్టీలోని కీలక పదవులు కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.