స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: సంస్కృతికి, ఆచార సంప్రదాయానికి ప్రతీకగా ఉండే భారత దేశం.. పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకోవడంతో నాటి తరం అనుభవించిన మధుర స్మృతులను నేటి తరం కోల్పోతుంది. కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ప్రజలు ఉరకలు పరుగులు తీస్తున్నారు. నేను.. నా భార్య.. నా పిల్లలు అనే ఆలోచనతో తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా తమ శ్రేయస్సే చూసుకుంటున్నారు. చివరకు పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాక.. మా తల్లిదండ్రులకు పట్టిన గతే.. మాకు పట్టిందని భోరున విలపిస్తున్నారు.
ఒకప్పుడు అమ్మమ్మ, తాతయ్య,పెదనాన్న, బాబాయిలు,పెద్దమ్మ, చిన్నమ్మ, మామయ్యలు, అత్తమ్మలు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బావామరదల్లు ఇలా అనేక బంధాలతో ఒక వ్యక్తి బ్రతికేవాడు. ఇప్పడు వీరంతా ఏమై పోతే నాకేం.. నేను నా పిల్లలు బాగుండాలి అని అనుకుంటున్నారు. ఇదంతా జరగటం ఉమ్మడి కుటుంబానికి దూరం కావడమే. అసలు ఉమ్మడి కుటుంబం వల్ల లాభాలు ఉన్నాయా? లేదా నష్టాలు ఉన్నాయా? ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా ఒక వ్యక్తి తన జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉన్నతంగా నడిపించేందుకు ఉమ్మడి కుటుంబం దోహదపడుతుంది. వీరందరి ప్రేమ ఆప్యాయతల నడుమ పెరిగిన మనిషి.. చెడు అలవాట్లు అస్సలు చేసుకోలేడు. ఒక వేళ చేసుకున్నా మా తాతయ్య ఏమంటాడో, మా పెద్దనాన్న ఏమంటాడో అన్న భయంతో మానేస్తాడు. ఇప్పడు చిన్న కుటుంబం వచ్చాక ఎవరు అడిగేవారు లేకపోవడంతో ఎవరి ఇష్టారీతిన వారు ప్రవర్తిస్తున్నారు. భార్యా భర్తల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పడు.. కుటుంబంలోని పెద్దవారు ఆ సమస్యకు పరిష్కారం చూపించేవారు. దంపతులు విడిపోకుండా కలిసుండేందుకు అనుక్షణం ప్రయత్నం చేసేవారు. అదే చిన్న కుటుంబంలో అయితే పరిష్కారాన్ని తామే స్వయంగా చూసుకోవాలి.. కోపంలో ఉన్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలే సరైనవని… విడిపోవడానికి సిద్ధం అవుతారు. వారి విడిపోయి హాయిగానే ఉంటారేమో.. మరి మన పిల్లలు ఏం తప్పు చేశారు. వాళ్లకు ఎందుకు ఈ శిక్ష అని ఆలోచించరు. సమాజం మీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నిస్తే పిల్లలు ఏం సమాధానం చెబుతారు అని కూడా వారు ఆలోచించరు. అదే పెద్దవారు ఉంటే పరిష్కార మార్గం చూపుతారు.
మరొక గొప్ప ప్రయోజనం ఏంటనే.. ఉమ్మడి కుటుంబంలో భార్యా భర్తలు ఎవరూ అక్రమ సంబంధాల జోలికి వెళ్ళలేరు. బంధాలు, బంధుత్వాల మధ్య పెరిగిన వారికి అలాంటి ఆలోచనలు ఎక్కువగా రావని పెద్దలు చెబుతారు. ఇంట్లో ఒంటరిగా మహిళ/ పురుషుడు ఉంటే.. ఏదైనా చెడు ఆలోచన రావచ్చు. అదే ఉమ్మడి కుటుంబలో అందరితో సంతోషంగా కలసిమెలసి ఉండటంతో ఎలాంటి ఆలోచన రాదు. ఇది మాత్రమే కాకుండా పెద్దవాళ్లు చెప్పే ఆరోగ్య అలవాట్లతో అనారోగ్యం రాకుండా చూసుకోవచ్చు.
ఇక చిన్న కుటుంబంతో ప్రయోజనాలు చూద్దాం. చిన్నకుటుంలో తాను సంపాదించిన డబ్బులు… వారికి మాత్రమే ఖర్చుపెడతారు. కుటుంబం మొత్తానికి ఖర్చుపెట్టాల్సిన పనిలేదు. ఎవరి పనిలో వారు బిజీ కావచ్చు. ఎవరు ఏం చేసిన అడిగే వారే ఉండరు. ఇష్టం వచ్చిన విధంగా ఉండచ్చు. ఇష్టం వచ్చిన ప్రదేశాలు చూడచ్చు. చిన్న కుటుంబంతో ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా చాలానే ఉన్నాయి. చిన్న కుటుంబంతో మనిషి మెకానికల్ లైఫ్ కి అలవాటు అవుతాడు. భార్య భర్తలు ఒకరికి తెలియకుండా అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు. పిల్లలు పెద్దవాళ్లు అయితే.. తల్లి దండ్రులు లేనిసమయంలో చెడు పనులు చేసే అవకాశం ఉంది. ఉమ్మడి కుటుంబానికి దూరంగా ఉన్నారు కావున.. వారి పిల్లలు పెద్దయ్యాక పెళ్లి చేసుకొని.. తల్లిదండ్రులను వదిలేస్తారు. అప్పుడు మేము సంపాదించినదంతా పిల్లలకోసమే అనుకున్నాం.. కానీ వాడికి సమయం వచ్చినప్పుడు వాడి సుఖం చూసుకొని మమ్మల్ని వదిలేశారని తీవ్ర మనోవేదనకు గురవుతారు.