గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఫోన్ ఎక్కడ..? దీనిపైనే ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసిన సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న వంశీ ఇంటిలో సోదాలు నిర్వహించారు. వంశీ ఉపయోగించిన ఫోన్ కోసం వెతికారు. ఆ మొబైల్ దొరికితే కేసుకు సంబంధించిన ప్రధానమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నిజానికి వంశీని అరెస్ట్ చేసే సమయంలో దుస్తులు మార్చుకొని వస్తానని చెప్పి చాలా సేపు ఇంట్లోని గదిలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయన సుమారు గంటపాటు ఎవరితోనే మాట్లాడినట్లు గుర్తించారు ఖాకీలు. అయితే.. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఆయన వాట్సప్‌లో మాట్లాడినట్లు భావిస్తున్నారు. దీంతో.. ఫోన్‌కు సంబంధించి ఐపీడీఆర్ వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు ఖాకీలు.
వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వంశీ జైలుకు వెళ్లాడన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని స్పష్టం చేశారు. వంశీపై కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పరిపాలన ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసని అన్నారు.
వంశీకి థ్రెట్ ఉంది
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సబ్ జైలుకు వెళ్లి వంశీతో ములాఖత్ అయ్యారు. కేసును ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేశారని ఆమె విమర్శించారు.
పంకజశ్రీ మాట్లాడుతూ.. వల్లభనేని వంశీ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని.. సొంత డబ్బులతో అరుణ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పారు. రూ.20వేల కోసం సత్యవర్థన్ అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టామని కేసు పెట్టారన్నారు. ఇందులో ఎంత వరకు నమ్మశక్యమో ప్రజలే చెప్పాలన్నారు. వంశీకి ప్రాణ హాని ఉందని.. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని అన్నారు. 22 గంటల పాటు సెల్‌లో పెట్టేసి,.. ఎవరూ రాకుండా , ఎవరితో సంబంధం లేకుండా ఉంచుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశరు. ఆయనను సెల్‌లో పెట్టి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. వంశీపై నేరాలు రుజువుకాకుండానే పనిష్‌మెంట్ సెల్‌లో పెట్టి, ఎవరూ కలవకుండా, 60 సీసీ కెమెరాలు పెట్టి క్షోభ పెడుతున్నారని అన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ఇలా వేధించడం తగదని చెప్పారు.
జైలులో టార్చర్ పెడుతున్నారని, నేలపై పడుకోబెడుతున్నారని వంశీ భార్య అన్నారు. సత్యవర్థన్ ఒప్పుకోవడం లేదు.. అందుకే వంశీని కోర్టులో ప్రవేశపెట్టడం లేదు.. వంశీపై మరిన్ని కేసులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. జైలులో వంశీకి థ్రెట్ ఉందని పంకజశ్రీ ఆరోపించారు.