తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు విభజన సమస్యలపై 6వ తేదీన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం మండలంలోని విలీన గ్రామ పంచాయతీల సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. విలీన పంచాయితీలపై చొరవ తీసుకోని తిరిగి తెలంగాణకు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ రాశారు. ఇద్దరు సీఎంల భేటీ నేపథ్యం లో ఏపీలో విలీనమైన యటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయితీలను భద్రాచలంలో కలపాలన్న డిమాండ్ బలంగా వస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనమయ్యాయి. భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు విలీనమయ్యాయి. శ్రీరాముడు కొలువైన రామాలయంతో టెంపుల్ టౌన్‌గా భద్రాచలం ఉంది. భద్రాచలం పట్టణం మినహా శివారు ప్రాంతం నుండి మండలం మొత్తం ఏపీలో విలీనమవ్వడంతో డంపింగ్ యార్డుకు కూడా స్థలం లేదు. దీంతో భద్రాచలం నుంచి చర్ల ప్రధాన రహదారిలో యటపాక ఆంధ్రాలో కలవడంతో అంతరాష్ట్ర సరిహద్దు సమస్యలు ఎదురవుతు న్నాయి. భద్రాచలం నుంచి చర్ల వెళ్ళేవారి ప్రయాణ పరంగా సాంకేతికం గా పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. భద్రాచలం రామాలయం దేవస్థానం భూములు పురుషోత్తపట్నం గ్రామంలో ఉండటంతో భూములపై ఆలయ అధికారులు పర్యవేక్షణకు పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నా యి . భద్రాచలం ఆనుకొని ఉన్న ఐదు గ్రామ పంచాయితీల ప్రజలు తమను తెలంగాణలో కలపాలంటూ పంచాయితీల్లో తీర్మానాలు చేశారు. ప్రజా విజ్ఞప్తులు దృష్టిలో పెట్టుకొని భౌగోళిక పరమైన విభజనతో ఇబ్బందులు పడుతున్న ఐదు గ్రామ పంచాయితీలను ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలనా సౌలభ్యం ప్రజా సంక్షేమం కోసం భద్రాచలంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతు న్నారు. తమ గ్రామాలను తెలంగాణలో కలిపేలా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆ ఐదు పంచాయతీలకు చెందిన పలువురు భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావుకు వినతిపత్రం అందచేశారు.
తెలంగాణ, ఏపీ విభజనకు ముందు భద్రాచలం డివిజన్‌లో యటపాక, పురుషొత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం పంచాయతీలు అంతర్బాగంగా ఉండేవి. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు పేరుతో స్ధానికుల అభిప్రాయాలు సేకరించకుండానే ఈ గ్రామాలను ఏపీలో కలిపారు. అయితే ఈ గ్రామాలు పోలవరం ముంపు గ్రామాలు కాకపోయినా ఆంధ్రాలో విలీనం చేయటాన్ని స్దానికులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామాల విలీనంతో భద్రాచలం విస్తీర్ణం తీవ్రంగా నష్టపోయిందని వాపోతున్నారు. పట్టణ విస్తరణకు అవకాశం ఉన్న భూభాగం ఏపీలోకి వెళ్లడంతో భద్రాచలం అభివృద్ది సైతం కుంటుప డిందని చెబుతున్నారు. భద్రాచలం పుణ్యక్షేత్రంతో పాటే పర్యాటక ప్రాంతంగా, మూడు రాష్ట్రాల గిరిజనులకు వ్యాపార కేంద్రంగా ఉండటంతో నానాటికీ జనాభా సైతం పెరుగుతుంది. అనధికార లెక్కల ప్రకారం ఇప్పటికే పట్టణ జనాభా లక్ష దాటింది. దీంతో ఆవాస ప్రాంతాలకు సరైన స్ధలం, ప్రభుత్వ అభివృద్ది పనులకు అవసరమైన స్ధలం లేకపోవడంతో ఈ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాల ని స్ధానికులు అప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం దేవస్ధానానికి చెందిన 900 ఎకరాల భూమి పురుషొత్తపట్నంలోనే ఉంది. దీంతో రామాలయ అభివృద్ది పనులు సైతం ముందుకు సాగడం లేదు.
ఏపీలో కలిసిన విలీన గ్రామాల ప్రజలు సైతం తమను తిరిగి తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. దీనికి సంబంధించిన రెండు రాష్ట్రాల అధికారులకు, తెలంగాణ ప్రజాప్రతినిధులకు వినతులు సమర్పి స్తూనే ఉన్నారు. పలుమార్లు రాస్తారోకోలు, మానవహారాలు, బంద్ వంటి కార్యక్రమాలతో నిరసన తెలిపారు. ఎన్నికల వేళ సైతం ఈ అంశం అన్ని పార్టీలకు అస్త్రంగా మారింది. తాజాగా ఆయా గ్రామాల వారు స్ధానిక ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం సమర్పించారు. మళ్లీ గోదావరి వరదల సీజన్ రానుందని, ఇప్పటికే తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఏపీలోని జిల్లా కేంద్రం దూరంగా ఉండటంతో ఏ పని ఉన్నా అంతదూరం వెళ్లలేకపోతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. భద్రాచలంతో తమకు అనుబంధం ఉందని, రాష్ట్రాలు వేరు కావడంతో పిల్లల చదువులు, ఉద్యోగాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. ఇరు రాష్టాల ముఖ్యమంత్రులు తమ సమస్యను సానుభూతితో అర్థం చేసుకొని పరిష్కరిం చాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.ఏపీలో తమ గ్రామ పంచాయితీల విలీనంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల సీఎం లు చొరవచూపాలని ఏడు మండలాల ప్రజలు కోరుతున్నారు.