గ్యాప్ ఇవ్వలేదు…. వచ్చింది… హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ అంటున్న మాటలివి. అక్రమ నిర్మాణాలు బుల్డోజ్ చేసిన హైడ్రా… కొన్ని రోజులుగా శాంతించింది. FTL నిర్ధారణ తర్వాత హైడ్రా దూసుకుపోనుందా…? కొత్త ఏడాది హైడ్రా ఏం చేయనుంది….? చెరువుల పరిరక్షణపై హైడ్రా భవిష్యత్ కార్యాచరణ ఏంటి…? కబ్జాలై చర్యలు ఎలా ఉండనున్నాయి…?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో హైడ్రా ఒకటి. కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు, అక్రమ కట్టడాలను కూల్చివేయాలని హైడ్రాను ఆదేశించింది సర్కార్. హైడ్రా ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండగా… హైడ్రా కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. హైడ్రా ఏర్పాటు జీవో తర్వాత అక్రమ కట్టడాలు అంటూ పలు నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభించింది. మొదట్లో నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చి సంచలనాలకు తెరలేపింది. కోర్టుకు వెళ్లేందుకు సైతం వీలులేకుండా… తెల్లారగానే హైడ్రా బుల్డోజర్లు అక్రమ కట్టాడాలకు వెళ్లిపోయి…. పని కానిచ్చేస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చాడంటే ఎవడికో మూడింది అనేంతలా బయపడిపోయారు హైదరాబాద్ వాసులు.
బడా బాబుల అక్రమ నిర్మాణాలు కూల్చితే శభాష్ అన్న ప్రజలే… పేదలు, మధ్య తరగతి వారు కట్టుకున్న ఇళ్ల జోలికి వెళ్లడంతో వ్యతిరేకత ప్రారంభమైంది. మూసి సుందరీకరణ పేరుతో నది పరివాహక ప్రాంతాలలో ఇళ్లను కూల్చుతామని ప్రభుత్వం ప్రకటించింది. పలు ఇళ్లకు రెడ్ మార్క్ వేయడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. రియల్ ఎస్టేట్ వెంచర్స్‌కి అనుమతులు లేవని… నోటీసులు ఇచ్చి… కూల్చేస్తారన్న ప్రచారం జరగడంతో హైడ్రాతోపాటు ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత వచ్చింది. దీంతో మేల్కొన్న ప్రభుత్వం ప్రజలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చమని… నిర్మాణంలో భాగమైన షెడ్డులు, ప్రైవేట్ వెంచర్స్ మాత్రమే కూలుస్తామని ప్రకటించింది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో కూల్చివేతలు ఇప్పట్లో ఉండవని… మొదటగా బఫర్, FTL నిర్ధారణ జరిగిన తర్వాత కూల్చుతామని ప్రకటించడంతో ప్రజల్లో ఉన్న వేడి తగ్గింది.
హైడ్రా వార్షిక నివేదికను కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. 27 ప్రాంతాల్లో 314 నిర్మాణాలు కూల్చివేశామని… ఇందులో 12 చెరువులు, 8 నాలాలు, 7 ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు చేపట్టింది. మొత్తం కూల్చివేతల్లో దాదాపు 200 ఎకరాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించింది హైడ్రా. హైడ్రాకి అధికారాలు లేవంటూ విమర్శలు రావడంటో అసెంబ్లీలో బిల్లుపెట్టి మరీ అన్ని శాఖల వద్ద ఉన్న అధికారాలను హైడ్రాకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.ఇందులో భాగంగా హైడ్రా పీఎస్ రానుంది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు FTLను గుర్తించడం ఈ ఏడాది టార్గెట్‌గా పెట్టుకుంది.
హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు ఉన్నాయని… వాటి వెనక బడా మాఫియాలు ఉన్నాయని హైడ్రై ఆరోపిస్తోంది. అక్రమ కట్టడాలపై హైడ్రాకు ఇప్పటి వరకు 5 వేల 800 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులన్నింటిని పరిశీలిస్తున్నామని సాధారణ ప్రజలు సొసైటీలు కాలనీ అసోసియేషన్ ఇచ్చేటువంటి ఫిర్యాదులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఇక అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. హైడ్రా కూల్చివేతలు ఆగలేదని… గ్యాప్ మాత్రమే వచ్చిందన్నారు. FTL నిర్ధారణ తర్వాత అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నా… ఎవరు కట్టినా…. ఎక్కడ ఉన్నా… కూల్చివేస్తామని ప్రకటించారు. 2019 జులై తర్వాత నిర్మాణాలపై మాత్రమే ఫోకస్ ఎక్కువగా ఉంటుందని… అంతకుముందు నిర్మాణాలను కూల్చివేయం అన్నట్లుగానే ప్రకటించారు రంగనాథ్.
సాధారణ ప్రజల్లో హైడ్రాపై ఎలాంటి వ్యతిరేకత లేదని… కొందరు సోషల్ మీడియా వేదికగా హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న రోజుల్లో హైడ్రా కార్యాచరణ ఏ రకంగా ఉంటుందో చూడాలి మరి.