రేపు తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా..సీఎం రేవంత్‌తో పాటు 23 మంది PAC సభ్యలు ఈ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అయితే PAC భేటీలో తీసుకునే కీలక నిర్ణయాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ PAC భేటీలో ఏఏ అంశాలపై చర్చ జరగనుంది..? ఈ మీటింగ్‌లో తీసుకునే నిర్ణయాలేంటి..?
T కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన కమిటీలలో PAC ఒకటి. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్‌గా మహేష్ గౌడ్ నియామకం తర్వాత తొలిసారి పీఏసీ భేటీ జరుగనుంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్ వేదికగా ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపా దాస్ మున్షీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్‌తో పాటు.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, పీఏసీ సభ్యులుగా ఉన్న రాష్ట్ర ముఖ్యనేతలంతా సమావేశంలో పాల్గొంటారు. దీంతో ఈ భేటీపై పార్టీ నాయకుల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్‌లు, సర్పంచి స్థానాల్లో 80 శాతం నెగ్గేలా గట్టిగా పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇందుకు శ్రేణులను సన్నద్ధం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరు, ఈ నెలాఖరులోగా పీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటు అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.
అయితే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో పలు కీలక తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలు, ఏడాది పాలనలో అందించిన పథకాలు జనాల్లోకి తీసుకువెళ్లడం వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి.. నియోజకవర్గాల్లో నేతల పనితీరు ఎలా ఉందనే వివరాలను పీసీసీ సేకరిస్తోంది. వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన కొన్నిచోట్ల వారితో స్థానిక నేతలకు సమన్వయం కుదరడం లేదని ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం కుదర్చడంపైనా పీఏసీ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది. మహేష్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలి PAC మీటింగ్ సమావేశం కావడం.. అందులోనూ అధిష్టానం దూత కేసి వేణుగోపాల్ హాజరవుతుందటంతో ఈ భేటీ మరింత కీలకం కానుంది. మరి PAC భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.