ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం చూపిస్తుందా? మెరుగైన సీట్లు గెలిచి కింగ్ మేకర్‌గా మారుతుందా? లేదంటే ఓట్లు చీల్చి గేమ్ ఛేంజర్ అవుతుందా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో తప్ప మరో చోటు బలమైన ప్రభావం చూపించని పార్టీ ఏఐఎంఐఎం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడూ స్థిరమైన సీట్లను తెలంగాణలో మాత్రమే గెలుచుకునే మజ్లిస్ పార్టీ.. మహారాష్ట్ర, బీహార్, యూపీల్లో కాస్త ప్రభావం చూపగలిగే సత్తా ఉంది. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఈ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. కానీ అక్కడ తమకు బలం ఉందని.. ఈ సారి తప్పకుండా సీట్లు గెలుస్తామంటూ బరిలోకి దిగింది ఎంఐఎం పార్టీ.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయనుంది. ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ముస్తాఫాబాద్ నుంచి తాహిర్ హుస్సేన్, ఓక్లా నుంచి షపాయర్ రహమాన్ ఖాన్ పోటీ చేయనున్నారు. వీటితో పాటు బాబర్పూర్, బల్లిమారన్, చాందినిచౌక్, జంగాపూర్, సదర్‌బజార్, మాటియామహాల్, కార్వాన్నగర్, సీలంపూర్ సెగ్మెంట్ల నుంచి బరిలో నిలవాలని పార్టీ నిర్ణయించింది. ఈ నియెజకవర్గాల్లో ముస్లింలు అత్యధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ సెగ్మెంట్లలో గత రెండు టర్మ్‌ల నుంచి ఆప్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. కార్వాన్నగర్ నుంచి మాత్రం 2020లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. రెండు స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించిన ఎంఐఎం వచ్చే వారం మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది.
ఢిల్లీ అసెంబ్లీకి ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఢిల్లీ అల్లర్లలో నిందితుడిగా ఉన్న తాహిర్ హుస్సేన్‌ను ముస్తాఫాబాద్ నుంచి బరిలోకి దించింది. ఈయన జమియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా గమనార్హం. ఇప్పటికే ఇతని అభ్యర్థిత్వంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శలను పట్టించుకోని ఎంఎంఐ.. ఢిల్లీ అల్లర్లలో మరో నిందితుడు సోహెబ్‌కు కూడా టికెట్ ఇవ్వాలని చూస్తోంది. దీనిపై విమర్శలు రాగా.. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చని, ప్రజలు ఓటేసిన వాళ్లు మాత్రమే గెలుస్తారని తాము నిలిపిన క్యాండిడేట్స్ హిస్టరీపై ఎంఐఎం పార్టీ వివరణ ఇస్తోంది. ఇతర పార్టీల అభ్యర్థులు జైలుకు వెళ్లొచ్చిన వారు ఉన్నారని పేర్కొంటోంది.
కాగా.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొంది. ఇండియా కూటమిలోనే ఉన్న కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్, మమత బెనర్జీలు కేజ్రివాల్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంఐఎం కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం అభ్యర్థుల కారణంగా.. మైనార్టీ ముస్లింల ఓట్లు చీలిపోతాయనే ఆందోళన నెలకొంది. అదే జరిగితే ఆప్ తీవ్రంగా నష్టపోతుందని.. అది బీజేపీకి అంతిమంగా కలిసొస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తుండటంతో బీజేపీ వ్యతిరేక ఓట్లు ఈ రెండు పార్టీల మధ్య చీలుతాయనే ఆందోళన ఉంది. ఇప్పుడు దీనికి ఎంఐఎం కూడా తోడు కావడంతో బీజేపీకి మార్గం సుగమనం చేసినట్లు అవుతుందనే చర్చ జరుగుతోంది.