ఒడిశాలోని పూరి జగన్నాథుని రత్న భాండాగారం రహస్య గదిలో ఏముంది..జగన్నాథునికి సంబంధించిన ఈ ఖజానాలో వజ్రవైఢూర్య, పచ్చలు, కెంపులు, రత్నాలు, పసిడి ఆభరణాలు, కిరీటాలు భద్రంగా ఉన్నాయా? పురుషోత్తముని నిలువెత్తు మయూరహారం పదిలంగా ఉందా? అన్న ఉత్కంఠ కోట్లాదిమంది భక్తుల్లో ఉంది. ఇవాళ రహస్యగది తలుపులు తెరవనున్న అధ్యయన సంఘం పెట్టెలు, అల్మరాలు తెరిచి అందులోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌కి తరలించడానికి ఏర్పాట్లు చేసింది. స్వామి ఖజానా గది తెరిచిన సంఘం ప్రతినిధులు కేవలం పెట్టెలు, అల్మరాలు చూసి వెనక్కువచ్చారు. సమయం లేక మళ్లీ గది తలుపులు సీల్‌చేసి వచ్చారు
గట్టి బందోబస్తు మధ్య రహస్య గదిలోని సంపద స్ట్రాంగ్‌రూంకు తరలించనున్నారు. పెట్టెలు, అల్మరాలు పరిశీలించనున్న సంఘం ప్రతినిధులు దిగువ సొరంగమార్గం ఉందా? మరో గది ఉందన్నది వాస్తవమా? కాదా?, దీనిపై అధ్యయనం చేశారా? అన్నది సంఘం సభ్యులు తెలియజేయాలని భక్తులు కోరుతున్నారు. జగన్నాథుని సేవకు అంకితమైన తామంతా ఆ స్వామి కార్యం నెరవేర్చడానికి రహస్యగది సంపద తరలింపు ప్రక్రియ చేపట్టామన్నారు శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాఢి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు జరుగుతాయన్నారు. ఉదయం 8 గంటల నుంచి శ్రీక్షేత్రంలో భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు. తాత్కాలిక ఖజానాకు సంపద తరలించిన తర్వాత భాండాగారాన్ని ఏఎస్‌ఐకి మరమ్మతులకు అప్పగిస్తారు. పనులు పూర్తయిన తర్వాత ఆభరణాలు మళ్లీ రహస్య గదికి తెచ్చి నిపుణుల ద్వారా లెక్కింపు చేపడతారు.
జగన్నాథుని రత్నభాండాగారం రహస్యగదిలోని సంపద లెక్కింపునకు 30 నుంచి 40 రోజుల వ్యవధి పట్టవచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా సంపద లెక్కింపు అంతత్వరగా సాధ్యం కాదంటున్నారు. రత్న భాండాగారం మరమ్మతులకు ఎన్నాళ్లు పడుతుందన్నది చెప్పలేమన్నారు. పురావస్తుశాఖ ఈ పనులు ఎన్నాళ్లలో పూర్తి చేస్తుందో స్పష్టత లేదని వివరించారు. జగన్నాథుని సేవలకు వినియోగిస్తున్న ఆభరణాలు కొన్నింటికి మరమ్మతులు అవసరమైతే చేయించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అలంకారప్రియుడైన స్వామికి ఎనలేని సంపద ఉన్నందున దేనికీ కొరత లేకుండా చూస్తామని, ఇది ప్రభుత్వ బాధ్యత అని మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ పేర్కొన్నారు.