29.7 C
Hyderabad
Thursday, April 18, 2024
spot_img

పార్టీ ఫిరాయిస్తే వేటు తప్పదా ?

   తెలంగాణలో వలస రాజకీయం దుమారం రేపుతోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ముగ్ధులైన నేతలపై అనర్హత వేటుకు పట్టుబడుతోంది బీఆర్‌ఎస్‌. ఇప్పటికే స్పీకర్, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన గులాబీ నేతలు ఎందాకైనా పోరాడుతామంటున్నారు. అయితే మీరు నేర్పిందే కదా మేం చేస్తున్నాం. ఇందులో కొత్తే ముందని హస్తం నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు. మరి జంపింగ్‌ జపాంగ్‌లకు అనర్హత వేటు తప్పదా..? సభాపతుల నిర్ణయం ఏంటి…?

       తెలంగాణలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పొలిటికల్‌ ఎపిసోడ్ కాకరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుండి నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న పోరు.. రోజు రోజుకు మరింత ముదురుతుందే తప్ప ఎవరికెవరూ తగ్గడం లేదు. ఇక అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌తో ఇప్పట్లో పనేముంది అనుకున్న నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడి వలస వెళ్లడంపై గులాబీ దళం మండిపడుతోంది. పదేళ్లపాటు పదవులు అనుభవించి.. కష్టకాలంలో పార్టీని వీడతారా అంటూ అగ్గి మీద గుగ్గిలంలా ఫైర్‌ అవుతోంది. అంతటితో ఆగకుండా మా పార్టీలో గెలిచి పక్క పార్టీకి ఎలా జంప్‌ అవుతారు..? వారిపై చర్యలు తీసు కోండి, అనర్హత వేటు వేయండి అని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌ల కు ఫిర్యాదు కూడా చేసింది. సభాపతులు స్పందించకపోతే న్యాయపోరాటానికి సిద్ధం.. కోర్టుల్లోనే తేల్చు కుంటామని హెచ్చరిస్తోంది.

శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమితో ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయన్నట్టు సాగుతోంది తెలంగాణ రాజకీయం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌దే హవా. కేసీఆర్‌ మాటే వేదం. కానీ ఇప్పుడలా కాదు. పదేళ్ల పాలన తర్వాత రాష్ట్ర ప్రజలు తీర్పుతో గులాబీ నేతలు ఓటమి రుచి చూడక తప్పలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ శిబిరంలో ఉన్న నేతల అసలు రంగు బయటపడుతోంది. గులాబీ కండువాతో ఏంటి పని.. అధికారం కావాలి కానీ అన్నట్టుగా కాంగ్రెస్‌, బీజేపీ వైపు క్యూకట్టారు. ఒక్కరిద్దరూ కాదు.. ఏకంగా కారు మొత్తం దాదాపు ఖాళీ అయింది. దీంతో కలవరంలో పడ్డ బీఆర్‌ఎస్‌ నేతలు… పార్టీ వీడిన నేతలపై వేటుపడాల్సిందేనన్న కసిలో ఉన్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. ఓడిన దుఃఖంలో మేముంటే.. లోక్‌సభ ఎన్నికల వేళ మమ్మల్నే మోసగిస్తారా అన్న ఆక్రోశంలో ఉన్నారు. దీంతో పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌లు ఆ పని చేయకపోతే న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి ఖైతరాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం హస్తం తరపున సికింద్రా బాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. దీంతో పార్టీ మారిన వెంటనే దానంపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కలిసి అనర్హత వేటుకు డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచి పార్టీ మారిన కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మండలి నుండి డిస్ క్వాలిఫై చేయాలని కోరుతూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి పిటిషన్‌ ఇచ్చారు.

 ఇక ఇదే బాటలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌ గూటికి చేరారు. దీంతో అతడిపై కూడా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక మరో గులాబీ నేత కే.కేశవరావు కూడా గులాబీకి గుడ్‌బై చెప్పారు. దీంతో కేకేపై కూడా అనర్హత పిటిషన్‌ ఇచ్చేందుకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారు. వీళ్లే కాదు.. ఇకపై ఎవరు పార్టీ మారినా అనర్హత వేటు వేసే వరకూ ఊరుకోమని హెచ్చరిస్తోంది బీఆర్ఎస్‌ పార్టీ. ఒక వేళ సభాపతులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అక్కడే తేల్చుకుంటామంటున్నారు.పార్టీ ఫిరా యింపులపై మండిపడుతున్న బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో ఫైర్‌ అవుతోంది. ఏమాత్రం తగ్గకుండా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తోంది. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేసిందేంటని నిలదీస్తోంది. రెండుసార్లు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్న గులాబీ నేతలకు పార్టీ ఫిరాయిం పులపై మాట్లాడే అర్హత లేదని ధీటుగా సమాధానం ఇస్తోంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య స్పీకర్‌, మండి చైర్మన్‌ నిర్ణయం ఎలా ఉండనుంది..? పార్టీ మారిన నేతలపై వేటు వేస్తారా లేదంటే గతంలో మీరు చేసింది ఇదే కదా! అని లైట్‌గా తీసుకుంటారా!  అన్నది ఆసక్తి రేపుతోంది.

Latest Articles

చియాన్ విక్ర‌మ్ 62వ చిత్రం ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజర్ రిలీజ్

విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టమే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న క‌థానాయ‌కుడిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్