విశాఖకు వచ్చిన డ్రగ్స్ కంటెయినర్ కేసు ఏమైందో టీడీపీ కూటమి ప్రభుత్వం విచారణ చేయాలన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఎన్నికల సమయంలో ఇదే విషయంలో తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారని.. దీనిపై ఇప్పుడు కూటమి సర్కారు పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారాయన. ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీలు పార్లమెంటులో ఇదే అంశంపై గళమెత్తాలన్నారు బొత్స.
సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ 25 వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను.. ఈ షిప్ ద్వారా దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ఈ సంస్థ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలి బంధువులకు సంబంధించినదని చెప్పుకొచ్చారు. దీనిపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగుచూస్తాయని, అవి నిజం కాకపోతే విశాఖపట్నం ఇమేజ్ మరింత పెరుగుతుందన్నారు బొత్స.
విశాఖలో భూ ఆక్రమణలు జరిగాయంటూ టీడీపీ నేతలు వివిధ వేదికలపై మాట్లాడుతున్న అంశాన్ని ప్రస్తావించారు బొత్స. గతంలో తెలుగు తమ్ముళ్లే ఒకరిపై ఒకరు టీడీపీ సర్కారు ఉన్నప్పుడు ఆరోపణలు చేసుకున్న విషయాన్ని వెల్లడించారు. అప్పట్లో దీనిపై సిట్ వేశారన్న బొత్స.. చిత్తశుద్ది ఉంటే ఆ దర్యాప్తును మళ్లీ కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని.. కావాలంటే ఎలాంటి విచారణకైనా ఆదేశించుకోవచ్చన్నారు మాజీ మంత్రి. అప్పుడు తప్పు చేసింది ఎవరన్నది తేలుతుందన్నారు బొత్స.