తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. అధికారం ఉంటే ఎంత గొప్పవారినైనా విచారించవచ్చు, అనే విషయం ప్రజలందరికీ అర్థమవుతోంది. ఎట్టకేలకు బంజారాహిల్స్ లోని సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. అయితే వద్దన్నా ఆమె ఇంటిముందు అభిమానులు, కార్యకర్తలు చేరారు. అక్కడ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ఇంటి ముందు మాత్రం భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. ‘డాటర్ ఆఫ్ ఫైటర్, విల్ నెవర్ ఫియర్ ’ (ఒక యోధుని కుమార్తె ఎన్నటికి భయపడదు) అనేవి పలు వెలిశాయి.
సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు కూడా ఉండటం విశేషం. లిక్కర్ స్కామ్ లో నిందితులైన బోయినపల్లి అభిషేకరావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహీంద్రు స్టేట్మెంట్ల ఆధారంగా కవితను ప్రశ్నించనున్నట్టు తెలిసింది. కేవలం ఈ కేసులో ఒక సాక్షిగా మాత్రమే కవితను అడగనున్నారు. అనంతరం సీఆర్పీసీ 161 కింద ఆమె వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు.
మరోవైపు కవిత ముందురోజు ప్రగతి భవన్ కి వెళ్లి తండ్రి కేసీఆర్ ను మరోసారి కలిసి వచ్చారు. సీబీఐ అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు చెప్పమని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటికే కవిత పలువురు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్టు సమాచారం. సీబీఐ అధికారుల విచారణ సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశాలున్నాయి. ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.