ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి.. పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైరయ్యారు. బీజేపీ గెలిచి నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలు తీర్చుతున్నామన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలకూ సీతక్క కౌంటరిచ్చారు. నిరుద్యోగులకు, యువకులకు జవాబు చెప్పుకోలేక మత రాజకీయాలకు బండి సంజయ్ పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా బిజెపి, కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు, సబ్జెక్టు అంతకన్నా లేదంటూ సెటైర్లు వేశారు. బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూస్తాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం తప్ప మరో మాట తెలియదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బిజెపికి లేదని సీతక్క చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత మందికి ఉపాధి కల్పించారు?.. అని సీతక్క ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని.. ప్రైవేటీకరణ పేరుతో ఉద్యోగాలను ఊడగొట్టారని ఆరోపించారు. దేవుని పేరుతో రాజకీయాలు చేసే బిజెపి… దేవునికి వినియోగించే అగర్‌బత్తీల మీద కూడా జీఎస్టీ వేసిందని మండిపడ్డారు.
ఉన్నత విద్య మీద 18శాతం జీఎస్టీ విధిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. అలాంటి బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఫైరయ్యారు. తెలంగాణ విభజన హామీలు అమలు కాలేదు.. ఎన్నికలప్పుడేమో హిందూ, ముస్లిం అని రెచ్చగొడతారని మండిపడ్డారు.
సీతక్క మాట్లాడుతూ.. “బండి సంజయ్..పాకిస్తాన్‌తో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దు. పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప మీరు దేశానికి చేసింది లేదు. దమ్ముంటే అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికల్లోకి రండి. ట్రైబల్ యూనివర్సిటీ పనులు కూడా మొదలుపెట్టలేని అసమర్థ కేంద్ర ప్రభుత్వం మీది. బండి సంజయ్‌కి చెప్పుకోవడానికి ఏం లేదు.. మాట్లాడడానికి రెండు మాటలు రావు.
పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలనుకుంటే.. భారత సరిహద్దుల్లో ఉన్న సైనికుల మాదిరిగా యుద్ధంలో పాల్గొనండి. ఆకలి చావులు అంతర్గత సమస్యలతో దివాలా తీసిన పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని అవమానపర్చకండి”.. అంటూ హితవు పలికారు.
సీతక్క ఇంకా మాట్లాడుతూ.. ” దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండి సంజయ్‌ని బీజేపీ పెద్దలు నియంత్రించాలి. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన భారతీయులంతా నా సోదరులే అన్న మీరు భారత రాజ్యాంగాన్ని కాపాడతానని చెప్పిన మీరు.. అధికారం కోసం విద్వేష ప్రసంగాలు అవసరమా? . మీరు దేశానికి చేసింది శూన్యం. సంవత్సరకాలంలో మేము 54 వేల ఉద్యోగాలు ఇచ్చాం. పట్టభద్రులారా.. భావోద్వేగాలతో రాజకీయాలు చేసే బండి సంజయ్‌కి, బిజెపికి గట్టిగా బుద్ధి చెప్పండి. యువతని, మత కొట్లాట వైపు మళ్లించి కేసులు నమోదు చేయించడమే బిజెపి రాజకీయం.
టిఆర్ఎస్, బిజెపి దొందూ దొందే. జఠిలమైన ఎన్నో సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. భారతదేశంలో యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నం మానుకోవాలి. ఈ చిల్లర మాటలు మానేయండి. ఇలాంటి విద్వేష పూరిత ప్రసంగాలు భారతీయుల ఐక్యతను దెబ్బతీస్తుంది. అన్ని రంగాల వెనుకబడ్డ పాకిస్తాన్‌తో భారతదేశాన్ని పోల్చి దేశ గౌరవాన్ని కించపరుస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోల్చుకోవాలి”.. అని సీతక్క అన్నారు.