పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిపై మంత్రి సమాధానం చెప్పలేక దాటేస్తున్నారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తాను చేసిన ఆరోపణలకు ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేదన్నారు. మంత్రి సమాధానం చెప్పలేక అధికారులు, కాంగ్రెస్ నేతలతో ప్రెస్ మీట్ పెట్టించారని ఆరోపించారు. తనపై కేసు పెట్టించారని ఆధారాలతో సహా అవినీతిని బయటపెట్టినా మంత్రి నుంచి ఉలుకూపలుకు లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అందులో 18 ప్రశ్నలను సంధించారు.
రన్నింగ్‌లో లేని రైస్ మిల్లులకు ధాన్యం ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు ఏలేటి. కొన్ని రేషన్ షాపులలో బియ్యం ఇవ్వకుండా కిలో 10 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తున్నారని ఏలేటి ఆరోపించారు. సివిల్ సప్లయి శాఖకు మిల్లర్లు చెల్లించాల్సిన డబ్బులు ఎందుకు వసూలు చేయడం లేదని నిలదీశారు. రైస్ మిల్లర్లతో మంత్రి ఉత్తమ్ రహస్య ఓప్పందం చేసుకున్నారని ఏలేటి ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో 800 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్న ఆయన.. 2వేల 200 రూపాయలకు సన్న వడ్లను రైస్ మిల్లర్లకు అమ్మి.. అదే రైస్ మిల్లర్ల దగ్గర 5వేల 700 రూపాయలకు సన్న బియ్యం కొనడం వెనక ఉన్న మతలబు ఏంటో చెప్పాలన్నారు. వడ్ల కొనుగోలులో కేంద్రం వాటా ఉందని, వడ్ల కొనుగోలుపై సీబీఐ దర్యాప్తు జరిపిం చాలని డిమాండ్ చేశారు. తాను సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాస్తానని చెప్పారు. తమ మీద లీగల్ కేసులు పెట్టడం కాదు. కాంగ్రెస్ నేతల మీదే లీగల్ కేసులు పెడతామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రిటైర్డ్ జడ్జితో నిజనిర్దారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా ప్రశ్నిస్తే..మంత్రిగా సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో రబ్ ట్యాక్స్ నడుస్తుందని రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.