నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించారాయన. ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛాంధ్రగా చేయాలని.. అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజల కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు సీఎం. ఫించన్లు, అన్నా క్యాంటీన్లు, దీపం కింద ఉచిత సిలెండర్లు ఇచ్చే పథకాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టామన్నారు. గతంలో తాను చెప్పినట్లుగానే ఇంటి వద్ద నుంచే యువత ఉద్యోగాలు చేస్తోందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా చెత్తను సంపదగా చేసుకొని ఆదాయాన్ని సంపాదించే మార్గంలో ముందుకు వెళుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. నెల్లూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి 620 మెట్రిక్ టన్నుల చెత్త తొలగించే బాధ్యత తీసుకుంటామన్నారు. నేరాలు, ఘోరాలు, అకృత్యాలు చేసి తప్పించుకుందామంటే కుదరదన్నారు సీఎం చంద్రబాబు. తమది జీరో టాలరెన్స్ ప్రభుత్వమన్నారు. ఆడబిడ్డల జోలికి వచ్చినా, ఈ గడ్డపై నేరాలు చేయాలనుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగాయన్నారు. ఎవరైనా గంజాయి తాగినా, సాగుచేసినా ఉపేక్షించేది లేదన్నారు ముఖ్యమంత్రి. డ్రగ్స్ విషయంలోనూ ఇదే పద్దతి అవలంభిస్తామని స్పష్టం చేశారు. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావించిన ఆయన.. ఇలాంటి వాళ్లను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు సీఎం చంద్రబాబు
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ” చెడు ఆలోచన చేసే వ్యక్తికి చెడు స్నేహమే వస్తుంది. చిత్తూరు జిల్లా గుర్రంకొండలో పెళ్లి చేసుకోలేదని ఒక అమ్మాయిని కత్తితో పొడిచాడు. గుంటూరులో ఒక దుర్మార్గుడు రెండు అత్యాచారాలు చేసి జైలు నుండి వస్తూ మరో అత్యాచారం చేశాడు. ఇటువంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి. నేరస్థులు పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. నేరాలు-ఘోరాలు చేసి తప్పించుకుందామంటే కుదరదు. ఆడబిడ్డల జోలికి వచ్చిన వారిని వదిలిపెట్టం. గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగింది. గంజాయి పై యుద్ధమే చేస్తున్నాం. ఎవరైనా గంజాయి తాగినా, సరఫరా చేసినా ఉపేక్షించం.
ప్రపంచం మొత్తం ఉష్ణోగ్రత పెరుగుతుంది. గత ఏడాది కంటే ఈఏడాది ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరికలు వస్తున్నాయి. వాతావరణ సమతుల్యం దెబ్బతింటే అకాల వర్షాలు రావడం, వర్షాలు లేకపోవడం వంటి పరిణామాలు జరుగుతాయి.
పేదల సేవలో ప్రభుత్వమని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. సంవత్సరానికి రూ.33 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సంక్షేమానికి నాంది పలికాం. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తితో సేవ అందిస్తా.
గత ఐదు సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు, సంపద సృష్టించలేదు. రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు ఆ అప్పుకి వడ్డీ, అసలు కట్టాలి. ఆ అప్పులను చూస్తే నాకు భయమేస్తుంది. అప్పు ఇచ్చినవాళ్లు నోటీసులు ఇస్తున్నారు. 8 నెలలుగా ఎప్పుడు జరగని విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గల్లా పెట్టె మాత్రం సహకరించడం లేదు. ఇది తాత్కాలికమైన ఇబ్బందే.
గత ప్రభుత్వంలో తట్ట మట్టి కూడా రోడ్డుమీద వేయలేదు. ప్రభుత్వం రాగానే రూ.1600 కోట్లు ఖర్చు చేసి గుంతలు లేని రోడ్లు చేశాం. నేను దీపం పెడితే వైసీపీ వచ్చిన తర్వాత దీపం ఆర్పేశారు.
వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అయ్యేది. రాష్ట్రంలో నదులు అనుసంధానం చేస్తా. గత ఐదేళ్లు రాష్ట్ర రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. ఇప్పుడు వాటిని రిపేర్లు చేస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటే సోలార్, విండ్ ఎనర్జీ రావాలి. రాష్ట్రంలో ఐదేళ్లుగా భూ సమస్యలు వచ్చాయి. మాట వినలేదని 22ఏ లో పెట్టి ప్రైవేటు భూములను ప్రభుత్వములుగా పెట్టారు. ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. కందుకూరు మున్సిపాలిటీకి రూ.50 కోట్లు ఇచ్చి ఇంటింటికీ నీళ్ళు ఇస్తాం. కందుకూరుని ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తాం. రామాయపట్నంలో లక్ష కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తాం” ..అని చంద్రబాబు అన్నారు.