అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఝార్ఖండ్‌లోని పాలము ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా సంకీర్ణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయ సర్కారుగా మారిందని.. ఇకనైనా వారిని గద్దెదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చొరబాటుదారులను అరికట్టడం కేవలం మోదీ నాయకత్వంలోని బీజేపీ వల్లే సాధ్యమవుతోందన్నారు. ఓబీసీ కోటాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహారాష్ట్రలోని కొన్ని వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని.. అయితే మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అనే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని అమిత్ షా అన్నారు.