కాకినాడ జిల్లా తాళ్ళరేవులో మత్స్యకారులకు ఓఎన్‌జీసీ నష్ట పరిహారం పంపిణీ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ముమ్మిడివరం నియోజకవర్గ, పరిసర ప్రాంతాల్లో ఉన్న మత్యకారులకు ONGC సంస్థ నష్ట పరిహారానికి శ్రీకారం చుడితే నేనే చేశానని జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికారని అచ్చెన్న దుయ్యబట్టారు. 2019 లో జగన్ ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని ఆరోపించారు. 5 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు అప్పులు చేసి మొత్తం రాష్ట్రాన్ని దోచేశారని అన్నారు. 2024 లో మేము వచ్చేటప్పటికీ రాష్ట్రం వెంటిలీటర్ పై ఉందన్న అచ్చెన్న… ఆరు మాసాల్లో కేంద్రం ప్రభుత్వం సహకరించడంతో రాష్ట్రానికి ఆక్సిజన్ అందిందని చెప్పారు . వాలంటీర్ల కంటే రెండు గంటల ముందే పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. వైసిపి ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజలను మాయ చేద్దామని చూసిందని.. మేము వచ్చిన వెంటనే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేసామని తెలిపారు. అన్ని హమీలు నెరవేర్చి మళ్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోకి వెళతామని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు.
రాష్ట్ర సంపద ఉద్యోగుల జీతాలకు సరిపోవడం లేదు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 8,400 కోట్లు తల్లికి వందనము ఇస్తాం. మత్యకారులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. ఏప్రిల్ 1కి వేట నిషేధంలో ఉన్న మత్యకారులకు రూ20 వేలు ఇచ్చి ఆదుకుంటాం. రాష్ట్రానికి రూ.లక్షా 80 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. 20 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. జగన్ దెయ్యాన్ని భూమిలో పాతి పెట్టి పైకి లేవకుండా చూస్తాం..దానికి ప్రజలు సహకరించాలి.. అని అచ్చెన్నాయుడు అన్నారు.