స్వతంత్ర వెబ్ డెస్క్: ఏడేళ్ల కిందట ఓ వ్యక్తి రోడ్డు పక్కన కూర్చుని.. తన మొబైల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నాడు. ఈ సమయంలో అతడు పోలీసుల కంటబడ్డాడు. దీంతో అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడిపై కేసు నమోదుచేశారు. ఐపీసీ సెక్షన్ 292 కింద తనపై నమోదయిన కేసును కొట్టివేయాలంటూ అతడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోర్న్ వందల ఏళ్ల నుంచి ఉందని తెలిపింది.
తన వ్యక్తిగత సమయంలో ఏకాంతంగా పోర్నోగ్రఫీ లేదా పోర్న్ వీడియోలను చూడటం చట్ట ప్రకారం నేరం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇతరులకు ప్రదర్శించకుండా ఒక్కరే పోర్న్ వీడియోలను చూస్తే అది అతడి వ్యక్తిగత విషయమని కోర్టు పేర్కొంది. అటువంటి చర్యను నేరంగా పరిగణించడం అనేది ఒక వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడమేనని, అతడి వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2016లో అలువా ప్యాలెస్ సమీపంలోని రోడ్డు పక్కన తన మొబైల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ పట్టుబడిన 33 ఏళ్ల వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 292 కింద పోలీసులు నమోదుచేసిన అశ్లీలత కేసును జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ కొట్టివేస్తూ ఈ తీర్పు వెలువరించారు. తనపై పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను, కోర్టు విచారణను రద్దు చేయాలంటూ నిందితుడు చేసిన అభ్యర్థనపై న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. అశ్లీలత, పోర్నోగ్రఫీ అనేది శతాబ్దాలుగా ఆచరణలో ఉందని, ఈ డిజిటల్ యుగం పిల్లలకు కూడా దీన్ని మరింత అందుబాటులోకి తెచ్చిందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
‘ఒక వ్యక్తి తన ప్రైవేట్ సమయంలో పోర్న్ వీడియోను ఇతరులకు ప్రదర్శించకుండా చూడటం నేరంగా పరిగణిస్తారా? అనేది నిర్ణయించాల్సిన ప్రశ్న.. అది అతడి వ్యక్తిగత ఎంపిక కాబట్టి అదే నేరం అని న్యాయస్థానం ప్రకటించదు.. ఇందులో జోక్యం చేసుకోవడం అతడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుంది’ అని న్యాయమూర్తి తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు.. అశ్లీల వీడియో లేదా ఫోటోలు ఐపీసీ సెక్షన్ 292 కింద నేరంగా పరిగణింపబడుతోందని జస్టిస్ కున్హికృష్ణన్ అన్నారు.