స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏపీకి చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్నట్లు వాల్తేరు డీఆర్‌ఎం అనూప్ కుమార్ వెల్లడించారు. వందమందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. వీరితోపాటు జనరల్ బోగీలో ఇంకా ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. అలాగే యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లోనూ ఎంతమంది ఏపీ వాసులున్నారో తేలాల్సి ఉందని చెప్పారు. మరోవైపు బాలేశ్వర్ నుంచి ప్రత్యేక రైలు కాసేపట్లో విశాఖ రానున్నట్లు తెలిపారు.
ప్రయాణికుల కోసం శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా జిల్లా కలక్టరేట్‌లలో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశామన్నారు. విజయవాడలో దిగాల్సిన 39మందిలో 23 మంది కాంటాక్ట్‌లోకి వచ్చారని.. ఏడుగురి ప్రయాణికుల ఫోన్లు స్విచాఫ్.. మరో ఐదుగురు ఫోన్‌లు లిఫ్ట్ చేయని పరిస్థితి నెలకొందన్నారు. అటు సహాయక చర్యలు కోసం ఏపీ అధికారుల బృందం ఒడిశా వెళ్లింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ప్రమాదస్థలికి చేరుకున్నారు. మరోవైపు సీఎం జగన్ ఆదేశాలతో ఇవాళ ఉదయమే ఘటనా స్థలానికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందం అక్కడికి చేరుకుంది.