ఏపీలో ఎన్డీయే కూటమి గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవనిగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందరూ కలిసి పనిచేస్తే అనూహ్య ఫలితాలు వస్తాయని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన కూటమి అభ్యర్ధులు ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్‌లను చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని మూడు పార్టీలు సమైక్యంగా కలిసి పనిచేశాయని తెలిపారు. ఈ ఐక్యమత్యం శాశ్వతంగా ఉండాలన్నారు.
పోలవరం పనులను మళ్లీ పట్టాలెక్కించామని చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం మొదలు పెట్టామన్నారు. అసాధ్యమనుకున్న విశాఖ స్టీల్‌ప్లాంటు సుసాధ్యమైందని తెలిపారు. విశాఖ రైల్వేజోన్ పూర్తిచేసుకున్నామన్న సీఎం…. రాష్ట్రానికి 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు
రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అదే సమయంలో రాజకీయ సుపరిపాలన ఉంటుందని, దానిలో ఎన్డీయే నాయకులే భాగస్వాములుగా ఉంటారని తెలిపారు. వైసీపీ నాయకులు రాజకీయాల్ని కలుషితం చేశారని మండిపడ్డారు. రాజకీయం ముసుగులో నేరాలు, ఘోరాలకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. ఎవరు తప్పుచేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు.