కాళ్లకు కట్టిన కత్తులతో సవాళ్లకు సిద్దమయ్యే పక్షిజాతి జీవాలు కోళ్లు. యావత్ విశ్వంలోనే అతిపురాతనమైన ఉత్కంఠ వీక్షక క్రీడ కాక్ ఫైట్. చక్రవర్తులు, రాజుల కాలంలో పౌరుషానికి ప్రతిక నిలిచిన వినోద విహంగ క్రీడా సమరమే కోడి పందేలు. ఓ బొబ్బిలి యుద్దం, మరో పల్నాటి యుద్ధం.. ఇలా ఎన్నో యుద్ధాలకు ఆద్యం కోళ్ల మధ్య జరిగిన యుద్ధాలే. అనాదిగా వచ్చిన కోడి పందేలు సంప్రదాయ క్రీడగా పేరొందాయి. పెద్ద పండువ సంక్రాంతి వచ్చిందంటే అందరి దృష్టి కోడి పందేల మీదే ఉంటుంది. పందెం కోళ్లు, కోడి పందేలు, పందెం రాయుళ్లు అంటే.. ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు. కోడి పందేల గురించి పంచాంగం మాదిరి ఏకంగా కుక్కుట శాస్త్రమే ఉంది.
శతాబ్దాల క్రితం నుంచి దేశంలో సంప్రదాయ క్రీడగా కొనసాగుతున్న కోడి పందేలకు ప్రపంచంలోనే అతి పురాతన పక్షిక్రీడగా పేరుంది. వేల సంవత్సరాలకు పూర్వమే పర్షియా లో కోడి పందేలు జరిగినట్టు కోళ్ల చరిత్ర చెబుతోంది. అయితే మనదేశంలో సంక్రాంతి కోడి పందేలకు ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రసిద్ధికాగా, ఏపీలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు పెద్ద పండువ కోడి పందేల నిలయాలుగా పేరొందాయి.
పందెం కోళ్లకు శత సహస్ర నామాలు ఉంటాయి. రంగును బట్టి కోళ్లకు పేర్లు ఉంటాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో డేగ, కాకి రకాలు ఎక్కువగా ఉంటాయి. తరువాతి స్థానంలో నెమలి, పర్ల జాతులు కనిపిస్తాయి. ఇవేకాక చవల, సేతువ, కొక్కిరాయి, రసంగి..తదితర ఎన్నో రకాల కోళ్లను పందెం రాయుళ్లు పోటీలకు దించుతారు. ఎన్నో రకాల్లో కోడి పందేలు నిర్వహించినా, ఎత్తుడు, దింపుడు పందేలకు యమ గిరాకీ ఉంటుందని పందెం రాయుళ్లు చెబుతున్నారు. పందెగాళ్ల పందేలకంటే… వీక్షక జనాల పందేలే టాప్ లెవెల్లో ఉండడం గమనార్హం. కోడి పందేలు కోటీశ్వరులను.. కూలి జనాలుగా మార్చేయగలవు. రోజు కూలీలను రాజాలుగాను చేసేయగలవు.
కోడి పందేలకు సంబంధించి ఎంతో గాథ ఉంది. మకర సంక్రాంతి పండువ దినాల్లో.. పందెం కోళ్లకు నక్షత్రాలు, తారాబలం, చంద్రబలం, కోడి రంగు, జాతి.. ఇలా ఎన్నో చూసి కోళ్లను పందేలకు దింపుతారు. సాధారణంగా భోగి నాడు గౌడ నెమలి, నెమలి జాతికి చెందిన పుంజులు మహ రంజుగా పోటీలకు దిగుతాయి. సంక్రాంతి నాడు యాసర కాకి డేగలు, కాకి నెమలి, పసి మగల్ల కాకులు, కాకి డేగల జాతికి చెందిన పుంజులు పోటీ పడతాయి. కనుమ నాడు డేగలు, ఎర్ర కాకి డేగలు పోటీ పడతాయి. ఈ జాతి రకాల కోళ్లు విన్నర్స్ జాతి కోళ్లని..వీటిని ప్రవేశ పెడితే గెలుపు ఖాయమని పందెం రాయుళ్లు భావిస్తారు.
మూడు నుంచి నాలుగు అంగుళాల చురకత్తులు కాళ్లకు కట్టి కోళ్లను పందెం బరిలోకి దించుతారు. అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ లు, మాల్ ప్రాక్టిస్ లు మాదిరి ప్రాచీన సంప్రదాయ వినోద క్రీడ కోడి పందేల్లోనూ అక్రమార్కాలు వచ్చేశాయి. ప్రత్యర్థి పుంజును తన పాద కరవాలంతో చిత్తు చేయగలిగే పుంజునే విజేతగా నిర్ణయిస్తారు. అయితే, అడ్డదారుల్లో గెలుపుల కోసం కత్తులకు విషరసాయనాలు పూయడం, స్టెరాయిడ్లతో పందెం కోళ్లను రంగంలోకి దింపడం వగైరా, వగైరా కాని పనులెన్నో కోడి పందేల్లో చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
పంచాంగకర్తలు, జ్యోతిష్య విద్యా ప్రవీణులు…జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది.. అంత చెప్పేస్తారు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలకు సంబంధించి కోళ్లకు ఓ శాస్త్రం ఉంది. అదే కుక్కట శాస్త్రం. కుక్కుట శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నతరువాతే పందెం రాయుళ్లు కోడి పందేలకు సిద్దం అవుతారు. కోడి పుంజుల జాతకమంతా కుక్కుట శాస్త్రంలో కన్పిస్తుందని, కుక్కుట శాస్త్ర ప్రవీణులు.. ఏ కోడి పుంజును పందేనికి ఎన్నుకోవాలి, ఏ సమయంలో కోడి పందేలు కాయాలి అనే అన్ని వివరాలు కుక్కుట శాస్త్రం తెలియజేస్తుందని.. పందెం రాయుళ్లు తెలియజేస్తున్నారు.
కోడి పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారతాయనే విషయం అందరికీ తెలిసిందే. పందెం కోళ్లను కొనడానికి పందెం రాయుళ్లు లక్షల రూపాయలు వెచ్చిస్తారు. ఇక వీటికి బలవర్థకర ఆహారం, సౌకర్యవంతమైన నివాసం, కఠోర శిక్షణ.. అబ్బో బోలెడు ఖర్చులు ఉంటాయి. ఎన్ని నిషేధాలు ఉన్నా…సంక్రాంతి మూడు రోజుల్లో కోట్ల రూపాయల మేర పందేలు సాగడం జరుగుతోంది. ఏపీలో పందెం కోళ్లు లక్షల సంఖ్యలో పోటీ పడుతుండగా, కోట్ల రూపాయల్లో పందేలు జరుగుతాయి. పందెం రాయుళ్ల పందేల కంటే చూపరుల పందేలా కోట్ల రూపాయల మేర ఉండడంతో.. అటు కోడి పందేల వైపు, ఇటు బరుల్లో పందెం కాసేవారివైపు.. కోళ్ల పందేలు చూసేందుకు వచ్చే జనాలు దృష్టి సారిస్తారని తెలుస్తోంది.