స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని వైఎస్ షర్మిల వెల్లడించారు. తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రెండో చోట నుంచి కూడా పోటీ చేయాలన్న డిమాండ్ ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా పోటీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని..అవసరం అయితే వీరిద్దరు కూడా పోటీ చేస్తారని తెలిపారు. విజయమ్మ పాలేరు నుంచి..తాను మిర్యాలగూడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. 119 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్టీపీ తరపున పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేద్దామనుకున్న మాట వాస్తవమని వైఎస్ షర్మిల తెలిపారు. కాంగ్రెస్ తో వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదని అనుకున్నామని..ప్రజా వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి వస్తుందని భావించినట్లు తెలిపారు. ఓట్లు చీలిస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నామని..అందుకే కాంగ్రెస్ తో చర్చలు జరిపినట్లు చెప్పారు. 4 నెలలు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణ ఖచ్చితంగా వైఎస్ఆర్టీపీ అధికారంలోకి వస్తుందని..వైఎస్ఆర్ సంక్షేమ పాలనను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తలతో వైఎస్ షర్మిల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎన్నికలపై పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రెండు రోజుల్లో వైఎస్ఆర్టీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.