స్వతంత్ర వెబ్ డెస్క్: వర్ధమాన నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి వివాహం అతి త్వరలోనే జరగనుంది. ఇందుకు సంబంధించి నాగబాబు కుటుంబం ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు కానీ, నవంబర్ 1న వీరి వివాహం నిర్ణయించినట్టు సమాచారం. అది కూడా ఇటలీలోని టుస్కానీ వద్ద నున్న బోర్గో శాన్ ఫెలోస్ రిసార్ట్ లో వివాహం జరగనుందని తెలుస్తోంది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ తదితర కుటుంబాలు దీనికి హాజరు కానున్నాయి.
వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం ఈ ఏడాది జూన్ 9న హైదరాబాద్ లో జరగడం తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుక పూర్తి చేశారు. వివాహానికి కూడా పరిమితంగానే అతిథులను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల పాటు వివాహ వేడుక జరగనుంది. హల్దీ, మెహెందీ, సంగీత్, వివాహం, అనంతరం బంధు మిత్రులకు పార్టీ ఇవ్వనున్నారు. అక్టోబర్ చివరి వారంలో మెగా, అల్లు కుటుంబాల సభ్యులు టుస్కానీకి ప్రయాణం కానున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తారని తెలిసింది.
వివాహం తర్వాత వరుణ్ తేజ్, లావణ్య హనీమూన్ లో భాగంగా నెల రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా అందమైన ప్రాంతాలను చుట్టి వస్తారని సమాచారం. హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా ఉంటుందని తెలిసింది. ఈ పెళ్లి కోసం మెగా, అల్లు కుటుంబాలు పదిరోజుల పాటు అన్నింటినీ పక్కన పెట్టేయనున్నట్టు తెలిసింది. అధికారిక ప్రకటన వస్తేనే దీనిపై మరింత స్పష్టతకు అవకాశం ఉంటుంది.