స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలో మరో వందేభారత్ రైలు పట్టాలపైకి రానుందా? అంటే అవుననే సమాధానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గురువారం రాత్రి 7.15గంటల సమయంలో వందేభారత్ రైలు శ్రీకాకుళం జిల్లాలోని పలాస స్టేషన్ లో ఆగింది. దాదాపు పది నిమిషాల పాటు అక్కడే ఉంది. దీంతో తొలిసారి పలాస వచ్చిన వందేభారత్‌ను చూసేందుకు ఎగబడిన ప్రయాణికులు సెల్ఫీలు దిగారు. స్టేషన్ లో ఈ రైలు ఆగడంతో స్టేషన్ సిబ్బంది కూడా ఆశ్చర్యపోయినట్లు సమాచారం.
అయితే ఈ రైలును విశాఖపట్నం మీదుగా భువనేశ్వర్ వరకు ట్రయల్ రన్ నిర్వహించారనే చర్చ జోరుగా జరుగుతోంది. త్వరలో ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి విజయవాడ వరకు ఈ రైలు నడవనుందనే ప్రచారం మొదలైంది. దేశంలోని ముఖ్య నగరాలు, పట్టణాలు, రాష్ట్ర రాజధానులకు వందేభారత్ రైళ్లను కేంద్రం వరుసగా కేటాయిస్తోంది.
ఈ క్రమంలోనే భువనేశ్వర్ నుంచి ఏపీకి వందేభారత్‌ను నడిపేందుకు సన్నాహాలు చేస్తుందనే చర్చ నడుస్తోంది. అందుకే ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహించినట్లు భావిస్తున్నారు. ఒకవేళ ఈ రైలు పట్టాలపైకి ఎక్కితే ఏపీ మీదుగా నడిచే మూడో వందేభారత్ రైలుగా నిలవనుంది.