స్వతంత్ర వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమైంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పేపర్, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీ-శాట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 50,646 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. వీరికోసం హైదరాబాద్‌లో 99 పరీక్షా కేంద్రాలను, వరంగల్ నగరంలో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 45,611 మంది పరీక్ష రాయనుండగా, వరంగల్‌లో 5,035 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతించలేదు.
సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ ఏడాదికి గాను మొత్తం 1105 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. వీటిల్లో 37 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. తెలుగు రాష్ట్రాల ఈసారి కూడా భారీగానే అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 72 నగరాల్లో దాదాపు 3 వేల పరీక్ష కేంద్రాల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు యూపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఏపీలో కూడా దాదాపు 40 వేల వరకు అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.