స్వతంత్ర వెబ్ డెస్క్: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. కొత్త పార్లమెంట్ భవంతి వద్ద ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించిన మోదీ.. నూతన ప్రజాస్వామ్య సౌధంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు ప్రధాని మోదీ. అనంతరం తమిళనాడుకు చెందిన మఠాధిపతుల నుంచి ఉత్సవ రాజదండం ‘సెంగోల్’ను ఆయన స్వీకరించారు. ఆ తర్వాత సెంగోల్‌ను లోక్‌సభలో స్పీకర్ కుర్చీ పక్కన నెలకొల్పి మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్ నూతన భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కొంతమంది కార్మికులను ప్రధాని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
అంతకు ముందు.. కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన ఓ క్లిప్‌ను విడుదల చేసి, ఈ వీడియోకు వాయిస్ ఓవర్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో సామాన్యుల నుంచి స్టార్స్ వరకు అందరూ ఇందులో పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా తన గాత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు హౌస్‌కి సంబంధించిన వీడియోను కూడా ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోను పంచుకుంటూ ఇది మన ‘నవ భారతదేశం’ అంటూ ట్యాగ్ లైన్ జోడించారు. “మన రాజ్యాంగాన్ని సమర్థించే, ఈ గొప్ప దేశంలోని ప్రతి పౌరుడికి ప్రాతినిధ్యం వహించే, రక్షించే వ్యక్తులకు ఎంత అద్భుతమైన కొత్త ఇల్లు. .. గ్లోరీ ఫర్ ఇండియా ఏజ్ ఓల్డ్ డ్రీమ్,” అంటూ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేసారు. అలాగే ఇది మన ‘నవ భారతదేశం’ కోసం అని తాను షేర్ చేసిన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
కింగ్ ఖాన్ లాగానే అక్షయ్ కుమార్ కూడా ప్రధాని మోదీకి కట్టుబడి ఉన్నాడు. అతను తన వాయిస్‌లో వీడియోను పోస్ట్ చేశాడు. భారతదేశం, దాని పురోగతి గురించి గర్వపడే ప్రతి వ్యక్తిలాగే, ఈ కొత్త పార్లమెంటును చూసి తాను భిన్నమైన ఆనందాన్ని పొందుతున్నానని చెప్పాడు. తాను ఢిల్లీలో నివసించినప్పుడు ఇండియా గేట్ చుట్టూ బ్రిటీష్ వారు నిర్మించిన భవనాలు మాత్రమే కనిపించేవని, అయితే ఈ కొత్త భవనాన్ని చూసి గర్వపడుతున్నానని అన్నారు. మరో వైపు నూతన పార్లమెంట్ భవనంపై దేశ, విదేశాల్లోని ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. అభినందలు కురపిస్తున్నారు. నూతన పార్లమెంట్ భవనం గురించి తమ గాత్రం వినిపించిన షారుక్ ఖాన్, అక్షయ కుమార్‌కి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు.